ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన కోహ్లీ.. ఆదిలోనే సౌతాఫ్రికా తడబాటు..

ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన కోహ్లీ.. ఆదిలోనే సౌతాఫ్రికా తడబాటు..

రాంచీ వేదికగా టీమిండియా మధ్య జరుగుతోన్న చివరిదైన మూడో టెస్ట్‌పై భారత్ క్రమంగా పట్టుబిగిస్తోంది.. ఇవాళ ఓవర్‌నైట్ స్కోరు 224/3తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా.. 9 వికెట్ల నష్టానికి 497 పరుగులు చేసిన తర్వాత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. నిన్న సెంచరీతో ఆకట్టుకున్న రోహిత్ శర్మ ఇవాళ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు.. 255 బంతులు ఎదుర్కొని 28 ఫోర్లు, 6 సిక్సర్లతో 212 పరుగులు చేశాడు హిట్ మ్యాన్. మరోవైపు అజింక్య రహానే కూడా సెంచరీతో భారత ఇన్నింగ్స్‌లో కీలక భూమిక పోషించాడు. 192 బంతుల్లో 17 ఫోర్లు, సిక్సర్‌తో 115 పరుగులు చేశాడు. ఇక, రవీంద్ర జడేజా 51, ఉమేశ్ యాదవ్ 31 పరుగులు చేశారు. 

497 పరుగుల దగ్గర టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆదిలోనే తడబాటుకు గురైంది. తొలి ఓవర్ రెండో బంతికే ఆ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. షమీ బౌలింగ్‌లో ఓపెనర్ డీన్ ఎల్గర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్‌లో ఉమేశ్ యాదవ్ చివరి బంతికి మరో ఓపెనర్ క్వింటన్ డికాక్‌(4)ను పెవిలియన్ పంపాడు. దీంతో ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడింది సౌతాఫ్రికా. మరోవైపు ఐదో ఓవర్ పూర్తయ్యాక వెలుతురు మందగించడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. రెండో రోజు వెలుతురు సరిగా లేని కారణంగా ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు.. ఇక, ఆట నిలిచిపోయే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 9 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా జట్టు.