వరల్డ్‌ కప్‌: నేడే భారత్ తొలి మ్యాచ్..

వరల్డ్‌ కప్‌: నేడే భారత్ తొలి మ్యాచ్..

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఆరంభమైనా క్రికెట్ ఫ్యాన్స్‌లో అంత ఊపు కనిపించడంలేదు.. ఎందుకంటే ఇంకా హాట్ ఫేవరెట్ టీమిండియా ఆట మొదలు పెట్టలేదు కాబట్టే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. అయితే, ఇవాళ్టి నుంచి వరల్డ్ కప్‌కు అసలైన జోష్ రానుంది. భారీ అంచనాలు.. అంతకు మించిన ఆకాంక్షల మధ్య వరల్డ్ కప్‌లో తొలి పరీక్షకు భారత్ సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఇవాళ సౌతాఫ్రికాతో తలపడనుంది. వార్మాప్ మ్యాచ్‌ల్లో మిశ్రమ ఫలితాలు ఎదురైనా లోతైన బ్యాటింగ్‌.. పదునైన బౌలింగ్‌పై తిరుగులేని నమ్మకంతో ఉంది. రోహిత్‌శర్మ సామర్థ్యం.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సత్తా.. ఎంఎస్ ధోనీ చాణక్యం టీమ్‌ఇండియాకు పెట్టని కోటలు. ఈ ముగ్గురి చుట్టూ అల్లుకున్న ఈ జట్టు కథకు శుభారంభం అత్యంత కీలకం. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన దక్షిణాఫ్రికాది చావోరేవో పరిస్థితి. మూడో మ్యాచ్‌లోనూ ఓడితే సెమీస్‌ అవకాశాలు సన్నగిల్లడం ఖాయం! కొంత బలహీనపడ్డట్లు కనిపిస్తున్నా ఆ జట్టును తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. దీంతో టీమిండియా తొలిపోరే ఆసక్తికరంగా సాగనుంది. 

టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఇలా ఉండొచ్చు... ఓపెనింగ్‌లో రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌.. వన్‌డౌన్‌లో విరాట్‌ కోహ్లీ.. నాలుగో నంబరులో కేఎల్ రాహుల్‌.. వికెట్‌ కీపర్‌గా ధోని.. ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్య స్థానాలకు ఢోకా లేదు. పేసర్లు ముగ్గురా? ఇద్దరా? అన్న దానిపైనే తుదిజట్టు కూర్పు ఆధారపడి ఉంటుంది. ముగ్గురు ప్రధాన పేసర్లతో బరిలో దిగితే బుమ్రా, షమి, భువనేశ్వర్‌ తుదిజట్టులో ఉంటారు. అప్పుడు హార్దిక్‌తో కలిపి ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో టీమ్‌ఇండియా బరిలో దిగుతుంది. స్పిన్‌ కోటాలో కుల్‌దీప్‌యాదవ్‌ లేదా చాహల్‌లలో ఒకరికి అవకాశం లభించనుండగా మిగిలిన ఒక స్థానం కోసం జడేజా, కేదార్‌ జాదవ్‌ల మధ్య పోటీ నెలకొంటుంది. ఇక వరల్డ్‌ కప్‌లో రెండు జట్లు నాలుగు మ్యాచ్‌ల్లో తలపడగా.. దక్షిణాఫ్రికా మూడు సార్లు.. ఒక దాంట్లో భారత్‌ నెగ్గింది. భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డే వార్‌లో భారత్‌ 34 మ్యాచ్‌ల్లో గెలవగా.. దక్షిణాఫ్రికా 46 విజయాలు సాధించింది. 3 మ్యాచ్‌ల్లో ఫలితం తేలకుండా పోయింది. 

జట్టు అంచనాలు:
టీమిండియా: విరాట్ కోహ్లి (కెప్టెన్‌), ఎంఎస్ ధోని, రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌, కేఎల్ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, బుమ్రా, షమి, భువనేశ్వర్‌ కుమార్, కుల్‌దీప్‌, జడేజా/జాదవ్‌
దక్షిణాఫ్రికా: డుప్లెసిస్‌ (కెప్టెన్‌), డికాక్‌, ఆమ్లా, డసెన్‌, మిల్లర్‌, మోరిస్‌, డుమిని, రబాడ, తాహిర్‌, ఫెలుక్వాయో, ప్రిటోరియస్‌