ఉప్పల్‌లో గ్రాండ్‌ విక్టరీ... రికార్డులు బ్రేక్ చేసిన టీమిండియా...

ఉప్పల్‌లో గ్రాండ్‌ విక్టరీ... రికార్డులు బ్రేక్ చేసిన టీమిండియా...

ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన టీ-20 మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.. వెస్టిండీస్‌పై విజయంతో టీమిండియా పలు రికార్డులను బ్రేక్ చేసింది. టీ-20ల్లో విండీస్‌పై వరుసగా 7వ విజయాన్ని అందుకుంది. అంతేకాక, 200 పైగా స్కోరును మూడోసారి ఛేదించింది టీమిండియా. 2009లో శ్రీలంకపై 207 పరుగుల లక్ష్యాన్ని.. 2013లో ఆస్ట్రేలియాపై 202 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది టీమిండియా. మరోవైపు పరుగుల సునామీ సృష్టించిన కోహ్లీ, పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించాడు. 94 పరుగులతో అజేయంగా నిలిచి.. పొట్టి ఫార్మాట్‌ కెరీర్‌లో అత్యధిక స్కోరు నమోదు చేశాడు. 2016లో ఆస్ట్రేలియాపై ఆడిలైడ్‌లో చేసిన 90 రన్స్‌ ఇప్పటివరకూ అత్యధిక స్కోరుగా ఉంది. తాజాగా ఆ స్కోరును బ్రేక్ చేశాడు. ఇక, వెయ్యి పరుగులు చేసిన టీమిండియా 7వ బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ నిలిచాడు. 

కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన వెండీస్ భారీ టార్గెట్ పెట్టింది.. అయితే, భారీ లక్ష్యాన్ని ఉఫ్‌ అని ఊదేసింది టీమిండియా... కోహ్లీ, రాహుల్ మెరుపు ఇన్నింగ్స్‌ల ముందు కొండంత లక్ష్యం చిన్నబోయింది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో కోహ్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌ వెస్టిండీస్ ఓపెనర్‌ సిమన్స్‌ 2 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్దే పెవిలియన్ చేరాడు. అయితే, షిమ్రన్‌ హెట్మేయర్‌ 56, లూయిస్‌40 రన్స్‌తో ధాటిగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. తర్వాత పోలార్డ్‌37, జేసన్‌ హోల్డర్‌24 పరుగులతో రాణించారు. దీంతో 5 వికెట్లు కోల్పోయిన కరేబియన్‌ టీమ్‌ 207 పరుగులు చేసి భారత్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో చాహల్‌ రెండు వికెట్లు తీయగా.. దీపక్‌ చాహర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా తలో వికెట్‌ పడగొట్టారు. భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్‌ రోహిత్‌శర్మ8 వికెట్‌ కోల్పోయింది. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌, కోహ్లీ జోడి మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. విండీస్ బౌలర్లను ఊచకోత కోస్తూ స్కోర్‌ బోర్డును పరుగెత్తించారు. 62 వ్యక్తిగత రన్స్‌ వద్ద రాహుల్‌ పెవిలియన్‌ చేరగా... మరింత విజృంభించిన కోహ్లీ విండీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 94 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. దీంతో 8 బంతులు మిగిలి ఉండగానే విజయం భారత్ సొంతమైంది. ఇక మూడు టీ20 సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది.