దుమ్ము దులిపిన విండీస్.. చేతులెత్తేసిన కోహ్లీ సేన..

దుమ్ము దులిపిన విండీస్.. చేతులెత్తేసిన కోహ్లీ సేన..

తొలి టీ-20 మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టి రికార్డుల మోతమోగించిన టీమిండియా.. రెండో టీ-20లోనూ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంటుందని విశ్లేషకులు అంచనా వేశారు... అయితే, అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి... తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా రెండో టీ20 మ్యాచ్‌లో విండీస్ విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.. దీంతో మూడో టీ-20 మ్యాచ్ కీలకంగా మారింది. టాస్‌ గెలిచి వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. తక్కువ పరుగులకే ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్ వికెట్లను కోల్పోయింది. రోహిత్ 15, లోకేష్ రాహుల్ 11 పరుగుల వ్యక్తిగత స్కోర్‌కే పెవిలియన్ చేరారు. శివమ్ దూబే మాత్రం 30 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, 3 ఫోర్లతో చెలరేగి 54 పరుగులు చేసి పరువు నిలిపాడు. కోహ్లీ 19, శ్రేయాస్ అయ్యర్ 10, జడేజా 9, రిషబ్ పంత్ 33 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి టీమిండియా 170 పరుగులు చేసి విండీస్ ముందు 171 విజయలక్ష్యాన్ని ఉంచింది. 

ఇక, టీమిండియా నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని విండీస్ ఆటగాళ్లు 9 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా అధిగమించారు. విండీస్ రెండు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్‌మన్స్.. టీమిండియా బౌలర్లలపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్ల మోత మోగించారు. సిమ్మన్స్ 67, పూరన్ 38 పరుగులతో విండీస్ విక్టరీలో కీలక పాత్ర పోషించారు. టీమిండియా విక్టరీ కొట్టి సిరీస్ కైవసం చేసుకుంటుందని భావించినా.. ఇప్పుడు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్ సిరీస్‌ ఎవరిదో తేల్చనుంది. డిసెంబర్ 11న, రాత్రి 7 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.