కీలక మ్యాచ్‌.. కప్ అందుకుంటారా? అప్పగిస్తారా?

కీలక మ్యాచ్‌.. కప్ అందుకుంటారా? అప్పగిస్తారా?

టీ-20 సిరిస్‌లో వెస్టిండీస్‌తో చావోరేవో తేల్చుకునేందుకు రెడీ అయింది టీమిండియా. ఉప్పల్‌లో గెలిచి, తిరువనంతపురంలో ఓడిన కోహ్లీసేన.. ముంబైలో సిరీస్‌ డిసైడర్‌ మ్యాచ్‌ ఆడనుంది. మ్యాచ్ విజేతే సిరీస్‌ను సొంత చేసుకోనుండటంతో... రెండు జట్లును ముంబై మ్యాచ్‌పై కన్నేశాయి. దీంతో క్రికెట్‌ అభిమానులు మరో ఆసక్తికర మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.  మరి టీమిండియా కప్ అందుకుంటుందా..? విండీస్‌కే అప్పగిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. 

పొట్టి క్రికెట్‌లో ఏ క్షణమైనా మ్యాచ్ మలుపుతిరగవచ్చు. అందుకే అన్ని అస్త్రాలతో భారత్ సిద్ధమవుతోంది. హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ రెండు మ్యాచ్‌లలో విఫలమైనా.. జట్టును ముందుండి నడిపించగలడు. తనదైన రోజున రెచ్చిపోగలడు. మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ఫార్మాట్‌లో క్లాస్ ప్లేయర్‌గా గుర్తింపు ఉన్న రాహుల్.. ఆరంభంలో బాగా ఆడితే టీమిండియా భారీ పరుగులు చేసే అవకాశం ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి రెచ్చిపోతే తిరుగుండదు. రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాని శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో కీలక ఆటగాడు. వరుసగా విఫలమవుతున్న కీపర్ రిషబ్ పంత్‌కు కోహ్లీ మద్దతుగా ఉన్నాడు. సంజుకు ఈ మ్యాచ్‌లోనూ ఛాన్సులు తక్కువగానే కన్పిస్తున్నాయి.

తిరువనంతపురం విజయంతో పొలార్డ్‌ సేనలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. సిమన్స్‌, లూయిస్‌, హెట్‌మైయిర్‌, పూరన్‌, పొలార్డ్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు నిలిచినా పరుగుల వరద ఖాయమే. పైగా వాంఖడే పొలార్డ్‌కు కొట్టినపిండి. అక్కడి పరిస్థితులు, పిచ్‌పై పూర్తి అవగాహన ఉంది. అతడు చెలరేగితే టీమిండియాకు కష్టాలు తప్పవు. ఇక, ఈ మ్యాచ్‌లోనూ టాస్‌ కీలకం కానుంది. టాస్‌ గెలిచిన టీమ్‌ ఛేజింగ్‌కే మొగ్గు చూపనుంది. దీంతో టాస్‌ గెలిచిన జట్టే మ్యాచ్‌ గెలిచే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. వాంఖడేలో రెండో ఇన్నింగ్స్‌లో మంచు కురుస్తుంది. బంతిపై బౌలర్లకు పట్టు చిక్కదు. బ్యాట్స్‌మెన్‌ అలవోకగా బౌండరీలు బాదేస్తారు. ఈ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారే అవకాశం ఉంది. దీంతో ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ లవర్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.