నేడు వెస్టిండీస్‌తో భారత్‌ ఢీ..

నేడు వెస్టిండీస్‌తో భారత్‌ ఢీ..

ఐసీసీ వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోన్న టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఇవాళ వెస్టిండీస్‌ జట్టుతో తలపడనుంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లన్నీ గెలిచి సెమీస్‌ దిశగా టీమ్‌ఇండియా అడుగులు వేస్తుంటే.. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడి నాకౌట్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది వెస్టిండీస్‌. ఫామ్‌లో ఉన్న రోహిత్‌, విరాట్ కోహ్లీల నుంచి భారత్‌ భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది. పాక్‌తో మ్యాచ్‌లో తడబడ్డ ప్రధాన పేసర్‌ బుమ్రా.. అఫ్గాన్‌పై తన బౌలింగ్‌ వాడి చూపించడం సానుకూలాంశం.  ఆ మ్యాచ్‌లో ఆడిన షమి కూడా సత్తా చాటాడు. స్పిన్నర్లు నిలకడగానే రాణిస్తున్నారు. ఇక, పాకిస్థాన్‌తో భారత్‌ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ స్టేడియమే వెస్టిండీస్‌తో పోరుకు వేదిక కాబోతోంది. 

ఇవాళ్టి మ్యాచ్‌కి వరుణుడి ప్రభావం ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు మాంచెస్టర్‌లో రెండు మూడు రోజులుగా వర్షం పడుతుండటంతో ఆందోళన కలిగించే విషయమే. ఓల్డ్‌ట్రాఫోర్డ్‌ మైదానం మామూలుగా బ్యాటింగ్‌కే అనుకూలం. ఇక్కడ పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 336 పరుగులు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పేస్‌ బౌలింగే ఆయుధంగా వరల్డ్‌క్‌పలో అడుగుపెట్టిన వెస్టిండీ్‌స.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టోర్నీలో ఏకైక విజయం అందుకుంది. న్యూజిలాండ్‌తో గత మ్యాచ్‌లో బ్రాత్‌వైట్‌ అద్భుత పోరాట పటిమ చూపడంతో విండీస్‌ గెలుపు అంచుల దాకా వచ్చింది. కానీ కేవలం ఐదు పరుగులతో ఓటమి చవిచూడడంతో నిరాశలో కూరుకుపోయింది. ఓపెన ర్లు శుభారంభాలు అందించకపోవడం జట్టును దెబ్బతీస్తోంది. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ కూడా నిలకడగా ఆడకపోవడంతో టోర్నీలో విండీస్‌ అనుకున్న ఫలితాలు సాధించ లేక పోతోంది. 

ఇప్పటి వరకు టీమిండియా-వెస్టిండీస్ మొత్తంగా 126 మ్యాచ్‌లలో తలపడగా... 59 మ్యాచ్‌ల్లో భారత్‌, 62 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌ విజయం సాధించాయి.  2 మ్యాచ్‌లు టైగా ముగియగా.. మూడు మ్యాచ్‌ల ఫలితం తేలలేదు. ఇక వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 8 సార్లు తలపడగా... 5 మ్యాచ్‌ల్లో టీమిండియా, 3 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ గెలుపొందాయి. 
 
భారత్‌ జట్టు అంచనా: విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విజయ్‌ శంకర్‌, ఎంఎస్ ధోనీ, కేదార్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, చాహల్‌/రవీంద్ర జడేజా, షమి, బుమ్రా
వెస్టిండీస్‌ జట్టు అంచనా: జాసన్‌ హోల్డర్‌ (కెప్టెన్‌), క్రిస్‌ గేల్‌, ఎవిన్‌ లూయిస్‌/ సునిల్‌ ఆంబ్రిస్‌, షాయ్‌ హోప్‌ (వికెట్‌ కీపర్‌), పూరన్‌, హెట్‌మయెర్‌, బ్రాత్‌వైట్‌, ఆష్లే నర్స్‌, రోచ్‌, కార్టెల్‌, ఒషానె థామస్‌.