భాగ్యనగరంలో క్రికెట్‌ ఫీవర్‌..హాట్‌ కేకుల్లా మ్యాచ్‌ టికెట్లు

భాగ్యనగరంలో క్రికెట్‌ ఫీవర్‌..హాట్‌ కేకుల్లా మ్యాచ్‌ టికెట్లు


ఈ నెల 6 న జరిగే టీ-20 మ్యాచ్‌ కోసం ఉప్పల్‌ స్టేడియం రెడీ అయింది. ఈ ట్వంట్వీ20 మ్యాచ్‌ టికెట్లు పక్కదారి పట్టాయి. క్రికెట్‌ అభిమానులకు టికెట్‌ దొరకడమే గగనమవుతోంది. భారీ డిమాండ్, అభిమానుల్లో క్రికెట్‌ క్రేజ్‌ను సొమ్ము చేసుకుంటూ అక్రమార్కులు బ్లాక్‌ దందాకు తెరలేపారు. ఆన్‌లైన్‌తోపాటు టికెట్‌ విక్రయ కేంద్రాల్లో కూడా అభిమానులకు టిక్కెట్లు  అందడం లేదు.  టీమిండియా, విండీస్‌ టీ-20 మ్యాచ్‌ కోసం క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎగబడుతున్నారు. దీన్ని క్యాష్‌ చేసుకోవాలన్న నిర్వాహకులు టికెట్లను హాంఫట్‌ చేస్తున్నారు. సైట్‌లో టికెట్లు సోల్డ్‌ అవుట్‌గా ఉండటంతో బ్లాక్‌ దందాకు తెరలేచింది.

తమ అభిమాన క్రికెటర్ల ఆట చూసేందుకు.. చేసేదేమి లేక బ్లాక్‌లో టికెట్‌ ధరకు నాలుగింతలు ఎక్కువ చెల్లించి హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియానికి క్యూ కడుతున్నారు. 800, వెయ్యి, 1500 రూపాయల టికెట్లు సైట్‌లో సోల్డ్‌ అవుట్‌గా ఉండటంతో... బ్లాక్‌ దందా మొదలైంది. ఓ ప్రముఖ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేందుకు యత్నిస్తున్న అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. కొందరు వ్యక్తులు ఆన్‌లైన్‌లో ముందుగానే పెద్దమొత్తంగా టికెట్లను బుక్‌ చేసుకొని మ్యాచ్‌ సమయానికల్లా వాటిని బ్లాక్‌లో విక్రయిస్తున్నారని ఫ్యాన్స్‌ చెబుతున్నారు. టికెట్‌ కౌంటర్ల వద్ద భారీ క్యూ పెరిగే వరకు చూసి, ఆ తర్వాత కొందరికే టికెట్లు ఇచ్చి మిగతా వారికి లేవని నిర్వహకులు చెబుతున్నారు. ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌కైనా బ్లాక్‌ టికెట్‌ దందాను అరికట్టాలని అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు.