విండీస్‌ ఆలౌట్...

విండీస్‌ ఆలౌట్...

రాజ్‌కోట్‌ వేదికగా రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్‌ ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి విండీస్ మూడవ రోజు చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 181 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు 468 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. ఫాలో ఆన్ లో ఉన్న విండీస్.. తన రెండవ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. 

ఓవర్ నైట్ స్కోరు 96/6 తో మూడవ రోజు ఆటను ప్రారంభించిన విండీస్ మరో 85 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. 74 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్ జట్టును చేజ్‌(53) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. మరోవైపు కీమో పాల్(47) కూడా చక్కటి సహకారం అందించాడు. కీమో పాల్ ను ఉమేష్ అవుట్ చేయడంతో.. ఈ జోడీ భాగసామ్యంకు తెరపడింది. అనంతరం చేజ్‌ కూడా అశ్విన్ కి చిక్కాడు. లెవీస్(0), గాబ్రియల్(1)లు కూడా తక్కువ స్కోర్ కే వెనుదిరిగారు. దేవేంద్ర బిషూ(17) నాట్ అవుట్ గా నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు తీసాడు.