367 పరుగులకు భారత్ ఆలౌట్

367 పరుగులకు భారత్ ఆలౌట్

హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 367 పరుగులకు ఆలౌట్ అయింది. విండీస్ బౌలర్లు హోల్డర్, గాబ్రియల్ చెలరేగడంతో భారత్ మూడవ రోజు 59 పరుగులు జతచేసి ఆరు వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 56 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంను సాధించింది. 

ఓవర్ నైట్ స్కోర్ 308/4 తో మూడవ రోజు ఆటను ప్రారంభించిన టీంఇండియాను విండీస్ కెప్టెన్ హోల్డర్ దెబ్బతీశాడు. ఒకే ఓవర్లో రహానే(80), జడేజా(0) లను పెవిలియన్ చేర్చాడు. కొద్దిసమయానికే రిషబ్ పంత్(92)ను గాబ్రియల్ వెనక్కి పంపాడు. ఉదయమే మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన అశ్విన్ (35).. కుల్దీప్, ఉమేష్, ఠాకూర్ లతో కలిసి టీమిండియాకు ఆధిక్యాన్ని అందించాడు. ధాటిగా ఆడే ప్రయత్నంలో అశ్విన్ బోల్డ్ అయ్యాడు. చివరకు శార్దూల్ ఠాకూర్ 4 పరుగులతో నాట్ ఔట్ గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో కెప్టెన్ హోల్డర్ ఐదు వికెట్లను తీసాడు. రెండవ రోజు షా, రహానే, పంత్ అర్ధ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 311 పరుగులకు ఆలౌట్ అయింది.