ఆత్మాహుతి దాడులపై 2 గంటల ముందు శ్రీలంకను హెచ్చరించిన భారత్

ఆత్మాహుతి దాడులపై 2 గంటల ముందు శ్రీలంకను హెచ్చరించిన భారత్

ఈస్టర్ ఆదివారం నాడు 300 మందికి పైగా ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రవాదుల వరుస ఆత్మాహుతి దాడులపై రెండు గంటలు ముందుగానే భారత నిఘా అధికారులు శ్రీలంక నిఘా అధికారులను హెచ్చరించినట్టు ఈ వ్యవహారంపై నేరుగా సమాచారం ఉన్న మూడు వర్గాలు తెలిపాయి. మొదటి దాడి జరగడానికి రెండు గంటల ముందు భారత నిఘా అధికారులు చర్చిలు లక్ష్యంగా దాడులు జరగవచ్చని శ్రీలంకలోని నిఘా వర్గాలకు తెలిపారు. దీనిని ఒక శ్రీలంక రక్షణ మూలం, ఒక భారత ప్రభుత్వ ఆధారం ధ్రువీకరించారు. 

మొదటి దాడికి కొన్ని గంటల ముందే హెచ్చరిక వచ్చినట్టు మరో శ్రీలంక రక్షణ వర్గం కూడా  స్పష్టం చేసింది. శనివారం రాత్రి కూడా భారత్ నుంచి హెచ్చరికలు వచ్చినట్టు శ్రీలంక వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 4, ఏప్రిల్ 20న కూడా ఇలాంటి సమాచారం శ్రీలంక నిఘా అధికారులకు అందజేసినట్టు భారత ప్రభుత్వ వర్గాలు వివరించాయి. అయితే దీనిపై శ్రీలంక అధ్యక్ష భవనం కానీ, భారత విదేశాంగ మంత్రిత్వశాఖ కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఆదివారం ఉదయం మూడు చర్చిలు, నాలుగు హోటళ్లపై ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారు. ఈ వరుస పేలుళ్లలో 321 మంది చనిపోగా 500 మందికి పైగా గాయపడ్డారు. దశాబ్దం క్రితం అంతర్యుద్ధం ముగిసినప్పటి నుంచి ప్రశాంతంగా ఉన్న ద్వీప దేశంలో ఈ పేలుళ్లు భయాందోళనలు నింపేశాయి. ఈ దాడులకు తమదే బాధ్యతని మంగళవారం ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే తమ ప్రమేయం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు చూపలేదు.