కోహ్లీ దంచాడు.. ఇండియా గెలిచింది..

కోహ్లీ దంచాడు.. ఇండియా గెలిచింది..

టీ-20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. ఇక వన్డే సిరీస్‌పై దృష్టిపెట్టింది.. అయితే.. వర్షం కారణంగా తొలి వన్డే రద్దు కావడంతో.. రెండో వన్డేలో గ్రాండ్ విక్టరీతో శుభారంభం చేసింది కోహ్లీ సేన.. ఓవైపు విరాట్ కోహ్లీ బ్యాట్‌తో విజృంభిస్తే.. మరోవైపు భువనేశ్వర్ బౌలింగ్‌తో ఆకట్టుకుని భారత జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. బౌలర్ల దాటికి వెస్టిండీస్ బ్యాట్స్‌మన్స్ నిలవలేకపోయారు.. మరోవైపు తొలి వన్డేను అడ్డుకున్న వరుణుడు.. రెండో వన్డేను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వర్షం కారణంగా మ్యాచ్‌కి అంతరాయం కలగడంతో డక్‌ వర్త్ లుయీస్ పద్ధతిలో టీమిండియా... వెస్టిండీస్‌పై 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

క్వీన్స్‌పార్క్‌ ఓవల్‌ స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 120 పరుగులతో చెలరేగిపోయాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 71 పరుగులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. టార్గెట్ చేధించేదుకు విండీస్ గట్టిగానే ప్రయత్నించినా వర్షం వల్ల ఆట ముందుకు సాగలేదు. మ్యాచ్ వాయిదా పడటంతో లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270 పరుగులకు తగ్గించారు. ఈ దశలో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయి వెస్టిండీస్ జట్టును కట్టడి చేశారు.. 42 ఓవర్లలో 210 పరుగులకే ఆలౌట్ అయ్యింది విండీస్ జట్టు. దీంతో 59 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత జట్టు.