ఉత్కంఠ పోరులో 8 పరుగులతో నెగ్గిన టీమిండియా

ఉత్కంఠ పోరులో 8 పరుగులతో నెగ్గిన టీమిండియా

ఆస్ట్రేలియాతో నాగ్ పూర్ లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ కోహ్లీ అద్భుత సెంచరీ, బౌలర్ల అదరగొట్టే బౌలింగ్ తో రెండో వన్డే భారత్ ఖాతాకు చేరింది. మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడటంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ విజయంతో 5 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-0 ఆధిక్యం సాధించింది. అలాగే టీమిండియా తన 500వ వన్డే విజయం సాధించినట్టయింది.

ఇవాళ టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య నాగ్ పూర్ లో జరిగిన డే నైట్ వన్డే మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాకు 251 పరుగుల లక్ష్యం ఇచ్చింది. భారత జట్టు 48.2 ఓవర్లలో 250 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత్ తరఫున కెప్టెన్ విరాట్ కోహ్లీ (116) పరుగులు చేశాడు. రోహిత్ శర్మ(0), శిఖర్ ధవన్(21),అంబటి రాయుడు(18), విజయ్ శంకర్(46), కేదార్ జాదవ్(11), మహేంద్ర సింగ్ ధోనీ(0), రవీంద్ర జడేజా(21), జస్ప్రీత్ బుమ్రా(0), కుల్దీప్ యాదవ్(3) పరుగులు చేశారు. మొహమ్మద్ షమీ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

తక్కువ స్కోర్ చేజ్ చేయడానికి బరిలోకి దిగిన ఆతిథ్య జట్టుకు మంచి ఆరంభం లభించింది. లో స్కోరింగ్  మ్యాచ్ లో చివరకు తడబడటంతో 49.3 ఓవర్లలో 242 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడం కంగారూల కొంప ముంచింది. ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ అత్యధికంగా 52 పరుగులు చేశాడు. 65 బంతుల్లో 4 బౌండరీలు, 1 సిక్సు కొట్టాడు. వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ పీటర్ హ్యాండ్స్ కాండ్ 48 రన్స్ కొట్టాడు. ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజా 38, కెప్టెన్ ఆరోన్ ఫించ్ 37 పరుగులు సాధించారు.