ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం

ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం

ఐసీసీ చాంపియన్‌ షిప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌ మహిళలతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళలు ఘన విజయం సాధించారు. టీమిండియా నిర్దేశించిన 203 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించలేక ఇంగ్లాండ్ 41 ఓవర్లలో 136 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 66 పరుగులతో విజయం సాధించింది. 203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కలేదు. 38 పరుగులకే టాప్ ఆర్డర్ జోన్స్ (1), బీమోంట్ (18), టేలర్ (10) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ నైట్ (39), సీవిర్‌ (44)లు జట్టును ఆదుకున్నారు. సీవిర్‌ అవుట్ అయిన అనంతరం ఏ ఒక్కరు కూడా క్రీజ్ లో నిలబడకపోవడంతో ఇంగ్లండ్‌ ఓటమి దిశగా పయనించింది. 41 ఓవర్లో ఏక్తా బిస్త్ మూడు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్‌ ఆలౌట్ అయింది. నైట్ చివరి వరకు క్రీజ్ లో ఉన్నా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ నాలుగు వికెట్లు తీసింది.

అంతకుముందు భారత్ 49.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ఓపెనర్‌ రోడ్రిగ్స్‌ (48), కెప్టెన్ మిథాలీ రాజ్‌ (44)లు రాణించారు. చివరలో తాన్య భాటియా (25), గోస్వామి (30)లు  పరుగులు చేయడంతో స్కోర్ 200 దాటింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఎల్విస్‌, సీవిర్‌, సోఫీ ఎలెక్‌స్టోన్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' ఏక్తా బిస్త్ కు దక్కింది.