రెండో వన్డేలో విజయం.. సిరీస్ భారత్ సొంతం

రెండో వన్డేలో విజయం.. సిరీస్ భారత్ సొంతం

ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ మహిళలతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 41.1ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఇన్నింగ్స్ ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోడ్రిగ్స్‌ (0) డక్ అవుట్ గా పెవిలియన్ చేరింది. మరో ఓపెనర్ స్మృతి మందాన, పూనత్ రౌత్ (32)తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపింది. ఈ క్రమంలో మందాన వన్డేల్లో 15వ హాఫ్ సెంచరీ చేసింది. పూనమ్ అవుట్ అయిన అనంతరం కెప్టెన్ మిథాలీ రాజ్ తో కలిసి 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. వేగంగా ఆడే క్రమంలో మందాన 63 (74 బంతుల్లో; 7 ఫోర్లు,  ఒక సిక్స్‌) ఎల్బీగా వెనుదిరిగింది. మిగితా పనిని దీప్తి శర్మ (6)తో కలిసి మిథాలీ రాజ్( 47) పూర్తి చేసింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ జట్టు భారత పేసర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లను చేజార్చుకుంది. నటాలీ సివర్ మాత్రమే 85 పరుగులు చేసింది. ఝులన్ గోస్వామి, శిఖా పాండేలు తలో నాలుగు వికెట్లు తీశారు. ఝులన్ గోస్వామికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది.