తొలి టీ-20లో భారత్ ఘన విజయం

తొలి టీ-20లో భారత్ ఘన విజయం

భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనను ఘనంగా ప్రారంభించింది. మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన తొలి టీ-20 మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మొదటి ఓవర్ లోనే ఎదురు దెబ్బతగిలింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(4) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన లోకేష్ రాహుల్‌ మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో కలిసి స్కోర్‌ బోర్డును పరిగెత్తించాడు. రాహుల్‌ మొదటి నుంచే బౌండరీలే లక్ష్యంగా ఆడాడు. ఇదే ఊపులో 27 బంతుల్లోనే రాహుల్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్ కు 123 పరుగుల భాగస్వామ్యం  నమోదు చేసిన అనంతరం రోహిత్‌ శర్మ (30; 32 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్సర్‌) అవుట్ అయ్యాడు. కెప్టెన్‌ కోహ్లి(20)తో కలిసి మిగితా లక్ష్యాన్ని రాహుల్‌ పూర్తి చేశాడు. రాహుల్‌ అజేయ సెంచరీతో చెలరేగడంతో 18.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో విల్లే, రషీద్‌ తలో వికెట్‌ సాధించారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇగ్లాండ్ జట్టును టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ బెంబేలెత్తించాడు. ఒక వైపు పేస్ బౌలర్ భువి దారుణంగా ఫలమైన వేళ కుల్దీప్ యాదవ్ భారత జట్టును ఆదుకున్నాడు. కుల్దీప్ వేసే బంతులను ఎదుర్కోవడంలో విఫలమైన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వరుసగా వికెట్లను సమర్పించుకున్నారు. నాలుగు ఓవర్లు వేసిన కుల్దీప్ 24 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ ను కోలుకొని దెబ్బ తీశాడు. ఓపెనర్లు జాసన్ రాయ్(30), జోస్ బట్లర్(69).. డేవిడ్ విల్లీ(29) మినహా ఇంగ్లాండ్ జట్టులో మరెవరూ రెండంకెల స్కోరు చేయలేదు. బైరిస్టో(0), రూట్(0)లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి159 పరుగులు చేసింది. తాజా విజయంతో మూడు టీ-20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యం  సంపాదించింది. కుల్దీప్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.