తొలి వన్డేలో భారత్‌ ఘనవిజయం

తొలి వన్డేలో భారత్‌ ఘనవిజయం

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నాటంగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్‌, భారత్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. మొదటగా భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్(6/25) బంతితో మాయ చేయగా.. బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ(137 నాటౌట్‌; 114 బంతుల్లో 15x4, 4x6) అజేయ సెంచరీ చేయడంతో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

టాస్ ఒడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్లు ఆచితూచి ఆడుతూ మంచి శుభారంభమే ఇచ్చారు. ఓపెనర్లు రాయ్‌(38), బెయిర్‌స్టో(38) జోడి 10 ఓవర్లకు 71 పరుగులు చేసారు. ఈ దశలో క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్లను చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. కుల్దీప్ దెబ్బకు కష్టాల్లో పడిన జట్టును స్టోక్స్(50), బట్లర్(53)లు ఆదుకున్నారు. వీరిని కూడా కుల్దీప్ అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ మరింత కష్టాల్లో పడింది. ఈ దశలో ఉమేష్ కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుంది. 49.5 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌట్ అయింది.

అనంతరం 269 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భరత్ 40.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రోహిత్‌, శిఖర్‌ ధావన్‌(40; 27 బంతుల్లో 8×4)ఇన్నింగ్స్ ఆరంభంలో స్వేచ్ఛగా ఆడారు. శిఖర్‌ వేగం పెంచడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించిన తర్వాత ధావన్‌ ఔటయ్యాడు. అనంతరం రోహిత్‌ ఇంగ్లాండ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 54 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన రోహిత్ అదే ఊపులో స్పిన్నర్ రషీద్‌ బౌలింగ్‌లో సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో కెప్టెన్ కోహ్లి కూడా 55 బంతుల్లో అర్ధసెంచరీ చేసాడు. రోహిత్‌, కోహ్లి జోడి రెండో వికెట్‌కు 167 పరుగులు జోడించారు. ఆ తర్వాత కోహ్లీ రషీద్‌ బౌలింగ్‌లో ఔటైనా.. రోహిత్‌, రాహుల్‌తో (9 నాటౌట్‌)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆరు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.