బోర్డర్‌లో కీలక పరిణామాలు.. చైనాకు షాక్‌..!

బోర్డర్‌లో కీలక పరిణామాలు.. చైనాకు షాక్‌..!

భారత్ - చైనా సరిహద్దుల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.. సరిహద్దుల్లో కీలకమైన చుషుల్ సెక్టార్‌లో చైనాకు భారత ఆర్మీ షాకిచ్చింది. ఆరు శిఖరాలను స్వాధీనం చేసుకొంది. దీంతో చైనా కీలక స్థావరాలు భారత్‌ గురిలోకి వచ్చాయి. ఈ పరిణామంతో చైనాపై ఒత్తిడి పెరిగిపోయింది. మరోవైపు.. అత్యంత కఠినమైన శీతల పవనాలు హిమసీమలను తాకాయి. మరోవైపు.. చైనాతో కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు మొదలయ్యాయి. వీటిల్లో సైనిక అధికారులతోపాటు విదేశాంగశాఖ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. భారత్‌ తాజాగా స్వాధీనం చేసుకొన్న ఆరు శిఖరాల్లో గురుంగు హిల్‌ కీలకమైంది. చైనా సాయుధ వాహనాలు చుషూల్‌ సెక్టార్‌లోకి ప్రవేశించడానికి ఉపయోగించే స్పంగూర్‌ గ్యాప్‌పై.. భారత బలగాలు పూర్తి స్థాయి పట్టు తెచ్చుకొన్నాయి. ఈ ప్రదేశంలోకి వచ్చే ఏ వాహనమైనా భారత దళాల ఆయుధ శక్తి పరిధిలోకి వచ్చేస్తుంది. చైనా వైపు స్పంగూర్‌ సరస్సు పక్కనుంచి వాహనాలు తరలించే చైనా మార్గాలు కూడా ఇక్కడి నుంచి కనిపిస్తాయి. చైనా ఏమాత్రం దళాలను పోగేసినా భారత్‌కు తేలిగ్గా అర్థమైపోతుంది. చర్చలు జరిగే మాల్డో పోస్టు ఈ పర్వతం పై నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 

ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ రెండో వారం వరకు వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైన్యం ఆరు ముఖ్యమైన కొండలను స్వాధీనం చేసుకుంది. వాటిలో మగర్‌ హిల్‌, గురుంగ్‌ హిల్‌, రిసెహెన్‌ లా, రెజంగ్‌ లా, మొఖ్పారీ, ఫింగర్‌ 4 సమీపంలో మరో ఎత్తయిన ప్రాంతం ఉంది. దీంతో చర్చల్లో బలంగా బేరం చేయడానికి భారత్‌కు మంచి ఆయుధం దొరికినట్లైంది. మరోపక్క పాంగాంగ్‌ సరస్సు వైపు ఫింగర్‌4 వద్ద  కూడా భారత్‌ అత్యధిక ఎత్తులో పట్టు సాధించింది. దీంతో కింద ఉన్న చైనా పోస్టులు భారత్‌ గురిలో ఉన్నాయి. మరోవైపు.. భారత్ తురుపుముక్క రఫేల్ .. లడఖ్ బౌగోళిక పరిస్థితులను అలవాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. అంబాలా స్థావరం నుంచి లడక్ వరకూ వెళ్లి చక్కర్లు కొడుతోంది. మొత్తానికి భారత వ్యూహం ఫలించిందనే చెప్పాలి.