ఆర్టీఐ పరిధిలోకి బీసీసీఐ

ఆర్టీఐ పరిధిలోకి బీసీసీఐ

కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ) భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి ఊహించని షాక్ ఇచ్చింది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి బీసీసీఐ రావాల్సి ఉంటుందని ఆదేశించింది. అయితే దీనిపై బీసీసీఐ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు నియమించిన క్రికెట్‌ పాలకుల కమిటీ నిర్లక్ష్యమే ఈ ఆదేశాలు రావడానికి కారణమని బీసీసీఐ అధికారులు అంటున్నారు. సీఐసీ తీర్పును సవాల్‌ చేయాలని బీసీసీఐ అధికారులు భావిస్తున్నారని సమాచారం. అయితే 15 రోజుల్లోగా బీసీసీఐ తమ మొత్తం వివరాలను ఇవ్వాలని సీఐసీ ఆదేశించింది.

గత జులై 10న సీఐసీ విచారణ జరిగింది. బీసీసీఐ ఎందుకు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదని ప్రశ్నించింది. దీనికి బీసీసీఐ సమాధానం ఇవ్వలేదు. దాంతో షోకాజ్‌ నోటీసులు బీసీసీఐకి వచ్చాయి. సీఐసీ ఉత్తర్వులను హైకోర్టులో సవాల్‌ చేయడమే తమ తదుపరి చర్య అని బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపారు. ప్రస్తుతం సీఐసీ ఉత్తర్వులపై న్యాయవాదులు పరిశీలిస్తున్నారని సమాచారం.