ఈ ఏడాది భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 7.3% ఉండొచ్చు: మూడీస్

ఈ ఏడాది భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 7.3% ఉండొచ్చు: మూడీస్

భారత ఆర్థిక వ్యవస్థ 2019-20 ఆర్థిక సంవత్సరంలో 7.3% వృద్ధి రేటు నమోదు చేయవచ్చని అమెరికా కేంద్రంగా పని చేసే రేటింగ్ ఏజెన్సీ మూడీస్ శనివారం అంచనా వేసింది. ఈ ఏడాది ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు స్వల్పకాల వృద్ధికి దోహదపడతాయని తెలిపింది. ఇతర పెద్ద ఆసియా ఆర్థిక వ్యవస్థలు, పెరుగుతున్న మార్కెట్లతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉత్పాదక వాణిజ్యాభివృద్ధి మందగించడం ప్రభావం భారత్ పై తక్కువగానే ఉంటుందని చెప్పింది. రాబోయే రెండేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా వృద్ధిని నమోదు చేయనున్నట్టు తెలిపింది. 2019, 2020 కోసం ఇవాళ విడుదల చేసిన తన త్రైమాసిక గ్లోబల్ మాక్రో ఔట్ లుక్ లో ఈ వివరాలు పేర్కొంది. 

మార్చి 2019తో ముగియనున్న 2018-19 ఆర్ధిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7% వృద్ధిరేటు నమోదు చేయవచ్చని అంచనా. 2017-18 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.2% కంటే ఇది తక్కువ. మధ్యంతర బడ్జెట్ 2019-20లో రైతులకు ప్రకటించిన ప్రత్యక్ష నగదు బదిలీ పథకం, మధ్యతరగతికి ఇచ్చిన పన్ను మినహాయింపు చర్యల కారణంగా జీడీపీలో సుమారుగా 0.45% వృద్ధి ఉండొచ్చని మూడీస్ అభిప్రాయపడింది. 

మూడీస్ వృద్ధిరేటు అంచనాలు కేలండర్ సంవత్సరం ఆధారంగా ఉంటాయి. కానీ భారత్ తన ఆర్థిక వృద్ధిరేటును ఏప్రిల్-మార్చి ఆర్థిక సంవత్సరం ఆధారంగా నిర్ణయిస్తుంది.