పాక్ విజయం.. కైఫ్‌పై విమర్శలు

పాక్ విజయం.. కైఫ్‌పై విమర్శలు

పాకికిస్థాన్ విజయం సాధిస్తే మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌పై విమర్శలు ఏంటని అనుకుంటున్నారా?. వివరాల్లోకి వెళితే.. జింబాబ్వేలో జరిగిన ముక్కోణపు టీ-20 సిరీస్‌ను పాకిస్థాన్‌ సొంతం చేసుకుంది. టీ-20 సిరీస్‌ ఫైనల్ మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై పాక్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ (46  బంతుల్లో 91; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెరీర్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌తో పాక్‌ను ముందుండి గెలిపించాడు. అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన ఓపెనర్ ఫఖర్‌ జమాన్‌పై భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ ప్రశంసలు కురిపించాడు.

'ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో విజయం సాధించి ముక్కోణపు టీ-20 సిరీస్‌ను సాధించిన పాకిస్థాన్ జట్టు అద్భుతం. ఈ మ్యాచ్ లో ఫఖర్‌ జమాన్‌ గ్రేట్‌ ఇన్నింగ్స్‌  ఆడాడు. అతను ఒక బిగ్‌ మ్యాచ్‌ ప్లేయర్‌ లా కనబపడుతున్నాడు.. కంగ్రాచ్యులేషన్స్‌' అంటూ కైఫ్‌ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన నెటిజన్లు  కైఫ్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 'దేశ ద్రోహి'.. 'పాక్ గెలిస్తే మీరు సంతోషపడతారా'.. 'పాక్ పై ఎంత ప్రేమ చూపిస్తున్నారో' అంటూ విమర్శల దాడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన పోస్టులు నెట్టింట్లో వైరల్ గా మారాయి.