న్యూజిలాండ్ కాల్పుల్లో గాయపడ్డ హైదరాబాదీ కుటుంబానికి సాయం చేయండి

న్యూజిలాండ్ కాల్పుల్లో గాయపడ్డ హైదరాబాదీ కుటుంబానికి సాయం చేయండి

న్యూజిలాండ్ లోని మసీదులో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 49కి చేరింది. పదుల సంఖ్యలో గాయపడినవారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. క్రైస్ట్ చర్చ్ నగరంలో మధ్యాహ్న ప్రార్థనలు జరిపిన తర్వాత సెమీ-ఆటోమెటిక్ ఆయుధాలు ధరించిన కొందరు దుండగులు రెండు మసీదులపై దాడి చేశారు. మసీదులు కాల్పలు జరిగినపుడు హైదరాబాద్ కి చెందిన ఇద్దరు ఉన్నట్టు హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.

కాల్పుల్లో ఇద్దరు హైదరాబాదీలు గాయపడిన సంగతిని ట్వీట్ చేస్తూ ఒవైసీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను ట్యాగ్ చేశారు. అసదుద్దీన్ తన ట్వీట్ లో గాయపడిన వ్యక్తుల పేర్లు అహ్మద్ జహంగీర్, ఫర్హాజ్ అహ్సాన్ అని తెలిపారు. ఫోటోలు, అనేక వివరాలను షేర్ చేశారు.

క్రైస్ట్ చర్చలోని రెండు మసీదులపై జరిగిన దాడుల్లో ప్రభావితమైన భారత నాగరికులెవరైనా తమను సంప్రదించాల్సిందిగా న్యూజిలాండ్ లోని భారత హైకమిషనర్ శుక్రవారం తెలిపారు. మధ్య క్రైస్ట్ చర్చ్ లోని అల్ నూర్ మసీదు, నగరం బయట ఉన్న లిన్ వుడ్ మసీదులపై జరిగిన దాడుల్లో కనీసం 49 మంది చనిపోయారు.

ఈ మారణకాండపై తమ సంతాపం వ్యక్తం చేస్తూ భారత హైకమిషన్, తమను సంప్రదించేందుకు రెండు నెంబర్లను ట్వీట్ చేసింది. ఇవి 021803899, 021850033. ఈ కాల్పుల్లో భారతీయులు గాయపడినట్టు కానీ, మరణించినట్టు కానీ ఇప్పటి వరకు సమాచారం లేదు. న్యూజిలాండ్ లో సుమారుగా రెండు లక్షల మంది భారతీయులు, భారతీయ మూలాలు ఉన్నవారు నివసిస్తున్నారు. భారత హైకమిషన్ గణాంకాల ప్రకారం న్యూజిలాండ్ లో 30000 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు.