మీటర్ తిరగాలని ఎన్నారై ఊబర్ డ్రైవర్ ఏం చేశాడంటే..

మీటర్ తిరగాలని ఎన్నారై ఊబర్ డ్రైవర్ ఏం చేశాడంటే..

ఆటో డ్రైవర్లు మీటర్ ఎక్కువ తిరగాలని దగ్గరి దారి వదిలి చుట్టూ తిప్పుతారనే ఫిర్యాదు ఎప్పటి నుంచో ఉంది. అమెరికాలోని న్యూయార్క్ లో ట్యాక్సీ యాగ్రిగేటర్ సంస్థ ఊబర్ డ్రైవర్ గా స్థిరపడిన ఓ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి మీటర్ ఎక్కువ తిరగాలని ఇదే చేశాడు. తన క్యాబ్ ఎక్కి నిద్రపోయిన ఒక మహిళను ఆమె చేరాల్సిన చోటికి అదనంగా 96 కిలోమీటర్లు తిప్పేశాడు. హర్బీర్ పర్మార్ (25) తను ఆ ప్రయాణికురాలిని కిడ్నాప్ చేసినట్టు నేరం అంగీకరించాడు. తను కిడ్నాపింగ్ కి, వైర్ మోసానికి పాల్పడినట్టు హర్బీర్ వైట్ ప్లెయిన్స్ ఫెడరల్ కోర్టు ఎదుట ఒప్పుకున్నాడు.

ఊబర్ లో డ్రైవర్ గా పనిచేసే పర్మార్ ఫిబ్రవరి 2018లో ఒక మహిళను న్యూయార్క్ లోని మాన్ హాటన్ దగ్గర క్యాబ్ ఎక్కించుకున్నాడు. ఆమె వైట్ ప్లెయిన్ కి వెళ్లాల్సి ఉంది. వెనక సీటులో ఆమె గాఢనిద్రలోకి జారకోవడంతో పర్మార్ తన ఊబర్ మొబైల్ అప్లికేషన్ లో వెళ్లాల్సిన ప్రదేశాన్ని మార్చేశాడు. దానిని మసాచుసెట్స్ లోని బోస్టన్ కి మార్చి అక్కడికి తీసుకెళ్లబోయాడు. ప్రయాణికురాలు మేల్కొనేసరికి వాహనం కనెక్టికట్ లో ఉంది. ఆమె తనను వైట్ ప్లెయిన్స్ కి లేదా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాలని కోరింది. కానీ అతను అందుకు నిరాకరించాడు. ఆమెను కనెక్టికట్ లోని హైవేపై వదిలేసి వెళ్లాడు. ఆమె దగ్గరలోని ఒక స్టోర్ కి వెళ్లి సహాయం అర్థించింది. 

రైడ్ షేరింగ్ సర్వీస్ ఉపయోగించుకున్న ఒక మహిళ నిస్సహాయతను అవకాశంగా తీసుకొని పర్మార్ ఆమెను కిడ్నాప్ చేసి భయపెట్టి హాని చేయబోయాడని యుఎస్ అటార్నీ జెఫ్రీ బెర్మాన్ ఆరోపించారు. 'అంతే కాకుండా అతను తన క్యాబ్ ఎక్కిన పలువురు కస్టమర్ల దగ్గర తప్పుడు చార్జీలు వసూలు చేశాడని' అన్నారు. చట్ట ప్రకారం దుర్మార్గమైన ఈ నేరాలన్నిటికీ పర్మార్ శిక్షార్హుడని తెలిపారు. 

ఇదే కాకుండా డిసెంబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2018 వరకు పర్మార్ చాలా సందర్భాలలో తన మొబైల్ అప్లికేషన్ లో మార్పులు చేసి ఊబర్ కస్టమర్లు వెళ్లాల్సిన ప్రదేశాల గురించి తప్పుడు సమాచారం ఇచ్చేవాడని గుర్తించారు. కొన్నిసార్లు అసత్య సమాచారంతో క్లీనింగ్ ఫీజుని కూడా కంపెనీ కస్టమర్ల ఖాతాల నుంచి వసూలు చేసేవాడు. ఈ అన్ని సందర్భాలలో తమ రైడ్స్ కు ఎక్కువ ఛార్జీలు వసూలు చేసినట్టు ఊబర్ కస్టమర్లు ఫిర్యాదులు చేశారు. 

అతనిని గత ఏడాది అక్టోబర్ లో అరెస్ట్ చేశారు. గరిష్ఠంగా జీవిత ఖైదు పడే కిడ్నాపింగ్, గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష విధించే వైర్ ఫ్రాడ్ కేసుల్లో పర్మార్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. అతనికి జూన్ లో శిక్ష విధిస్తారు.