మూడో టెస్టులో భారత ఆటగాళ్లు నెలకొల్పిన రికార్డులు ఇవే...

మూడో టెస్టులో భారత ఆటగాళ్లు నెలకొల్పిన రికార్డులు ఇవే...

పింక్‌ బాల్‌ టెస్టులో.. టీమిండియా సాధించింది మామూలు విక్టరీ కాదు. ఎందుకంటే, ఈ మ్యాచ్‌లో చాలా రికార్డులే బద్దలయ్యాయి. ధోనీ రికార్డును తిరగరాసి.. సొంతగడ్డపై అత్యుత్తమ సారథిగా కోహ్లీ అవతరిస్తే.... వికెట్ల వేటలో భళా అనిపించిన బౌలర్లు అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌... అద్భుతమే చేశారు.

భారత్‌, ఇంగ్లాండ్‌ మూడో టెస్టులో పలు రికార్డులు బద్దలు అయ్యాయి. సొంతగడ్డపై అత్యుత్తమ సారథిగా విరాట్‌ కోహ్లీ అవతరించాడు. అతడు మహీ రికార్డును తిరగరాశాడు. మరోవైపు సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ 400 వికెట్ల ఘనత అందుకొన్నాడు. రెండో టెస్టులోనే 10కిపైగా  వికెట్లను పడగొట్టి అద్భుతం చేశాడు అక్షర్‌ పటేల్‌. భారత్‌ తరఫున అత్యంత విజయవంతమైన సారథిగా ఇప్పటికే విరాట్‌ కోహ్లీ ఘనత సాధించాడు. తాజాగా ఇంగ్లాండ్‌పై విజయంతో ఎంఎస్‌ ధోనీ రికార్డు బద్దలు కొట్టాడు. గతంలో సొంతగడ్డపై అత్యధిక విజయాల రికార్డు మహీ పేరుతో ఉండేది. అతడి సారథ్యంలో టీమ్‌ఇండియా భారత గడ్డపై 30 మ్యాచులకు.. 21 విజయాలు అందుకుంది. ఇప్పుడు కోహ్లీ 29 టెస్టుల్లో 22 విజయాలను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా కోహ్లి సారథ్యంలో భారత్‌ ఇప్పటివరకు 59 టెస్టులాడితే 35 గెలిచింది. స్వదేశం, విదేశం కలుపుకొని టీమిండియాకు టెస్టుల్లో ఎక్కువ విజయాలు సాధించి పెట్టిన కెప్టెన్‌గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. కోహ్లి తర్వాత ధోని 60 మ్యాచ్‌ల్లో 27 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. గంగూలీ 21 విజయాలతో మూడో స్థానంలో ఉన్నాడు.
 
ఈ పింక్‌ బాల్‌ టెస్టులో.. టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. 400 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన అశ్విన్‌... 77 టెస్టుల్లోనే 401 వికెట్లు తీశాడు. దీంతో, భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా.. మూడో స్పిన్నర్‌గా రికార్డులకెక్కాడు అశ్విన్‌. అంతేకాదు, శ్రీలంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ తర్వాత ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగంగా 400 వికెట్ల మైలురాయి చేరుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు అశ్విన్‌.

గాయపడ్డ రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌... ఆ స్థానాన్ని అంచనాలను మించి భర్తీచేశాడు. అరంగేట్ర టెస్టులోనే ఐదు వికెట్ల రికార్డు సాధించిన అక్షర్‌... మొతేరాలో 10కి పైగా వికెట్లు పడగొట్టి భళా అనిపించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. ఈ డే/నైట్‌ టెస్టులో 70 పరుగులిచ్చి 11 వికెట్లు తీసిన ఈ యువ బౌలర్‌.. ఈ తరహా మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు 2018-19లో శ్రీలంకపై ప్యాట్‌ కమిన్స్‌ 62 రన్స్‌ ఇచ్చి పది వికెట్లు,  2016-17లో పాక్‌పై దేవేంద్ర బిషూ 174 పరుగులిచ్చి 10 వికెట్లు తీశారు. వారందరికంటే, అక్షర్‌వే మెరుగైన గణాంకాలు కావడం విశేషం. డే/నైట్‌ టెస్టులో స్పిన్నర్లు అత్యధిక వికెట్లు తీసింది అహ్మదాబాద్‌ టెస్టులోనే కావడం మరో విశేషం. ఇంగ్లాండ్‌, భారత్‌ స్పిన్నర్లు మొత్తంగా 27 వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు దుబాయ్‌లో పాక్, శ్రీలంక‌ మ్యాచులో 24, పాక్‌,వెస్టిండీస్‌ టెస్టులో 22, ఆసీస్‌,న్యూజిలాండ్‌ పోరులో 8 వికెట్లు తీశారు బౌర్లు. 

మోతేరా టెస్టులో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ... ఓ విచిత్రమైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో వందో టెస్టు ఆడిన ఇషాంత్‌... తన తొలి సిక్స్ కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్‌లో ఇషాంత్ శర్మ మిడ్ ఆఫ్ మీదుగా సిక్స్ కొట్టాడు. ఈ సిక్స్ కొట్టడం కోసం ఇషాంత్ ఏకంగా 100 టెస్టులు వేచి చూడడం విశేషం. 

అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్‌ తీసిన బౌలర్లు కేవలం నలుగురే ఉన్నారు. 1888లో ఆసీస్‌పై బాబ్‌ పీల్‌, 1907లో ఇంగ్లాండ్‌పై బెర్ట్‌ వోగ్లర్‌, చెన్నై టెస్టులో ఇంగ్లాండ్‌పై అశ్విన్‌ ఈ ఘనత సాధించారు. మొతేరా టెస్టులో సత్తా చాటిన అక్షర్‌ పటేల్‌కు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో తొలి బంతికే జాక్‌ క్రాలీని పెవిలియన్‌ పంపించి.. తొలి బంతికే తొలి వికెట్‌ తీసిన నాలుగో బౌలర్‌ గా రికార్డు సృష్టించాడు.