ఐపీఎల్ ఆటగాళ్ల వేలం నేడే

 ఐపీఎల్ ఆటగాళ్ల వేలం నేడే

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) - 2019 కోసం ఆటగాళ్ల వేలం ఈ రోజు జరగనుంది. జైపూర్‌ వేదికగా జరిగే ఈ వేలం కేవలం ఒకే రోజుతో ముగుస్తుంది. ఈ వేలంలో 8 జట్లు 70 మంది ఆటగాళ్లను ఎంచుకోనున్నాయి. ఇందులో 50 మంది భారత క్రికెటర్లు కాగా.. 20 మంది విదేశీ క్రికెటర్లకు అవకాశం ఉంది. ఐపీఎల్‌ - 2019 వేలం కోసం 1,003 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా.. వడపోత అనంతరం 346 మంది అందుబాటులోకి వచ్చారు. 346 మంది ఆటగాళ్లలో 70 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. ఈ వేలం కోసం అన్ని ఫ్రాంచైజీల వద్ద కలిపి రూ. 145.25 కోట్లు ఉన్నాయి.

వేలంలో యువరాజ్‌ సింగ్, గంభీర్, ముస్తఫిజుర్, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, బ్రెండన్‌ మెకల్లమ్‌, క్రిస్‌ వోక్స్‌, మలింగ, షాన్‌ మార్ష్‌, శామ్‌ కుర్రాన్‌, కొలిన్‌ ఇంగ్రామ్‌, కొరె ఆండర్సన్‌, మాథ్యూస్‌, డి ఆర్సీ షార్ట్‌ వంటి వారు పాల్గొననున్నారు. ఇందులో ముస్తఫిజుర్, మెకల్లమ్‌, కుర్రాన్‌, వోక్స్‌ లను దక్కించుకునేందుకు అందరూ పోటీ పడుతున్నారు. భారత్ నుండి యువీ, గంభీర్, షమి, సాహా, అక్షర్‌ పటేల్‌లు కూడా ఉన్నారు.

వచ్చే ఏడాది మే నెలాఖరు నుంచి వన్డే ప్రపంచ కప్‌ ఉన్న నేపథ్యంలో.. లీగ్‌ మార్చి 23 న ప్రారంభమై మే రెండో వారంలో ముగుస్తుంది. అనంతరం ఆటగాళ్లు తమ జాతీయ జట్టుకు అందుబాటులో ఉంటారు. ఐపీఎల్‌ అనంతరం పెద్ద సమయం లేనందున ఆయా దేశాల బోర్డులన్నీ తమ ఆటగాళ్లకు పరిమితంగానే అనుమతులిచ్చాయి. దీంతో వారు ఏ దశ వరకు లీగ్‌లో అందుబాటులో ఉంటారనేదానిపై క్లారిటీ లేదు. ఐపీఎల్ ముగిసిన వెంటనే 15 రోజుల్లోనే ప్రపంచ కప్.. అనంతరం యాషెస్ సిరీస్ కూడా ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆసీస్ టాప్ ప్లేయర్స్ ఎవరూ కూడా లీగ్‌లో పాల్గొనట్లేదు. మరోవైపు దాదాపుగా అదే సమయంలో లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున ఐపీఎల్‌ నిర్వహణ ఎక్కడ అనేదానిపై కూడా బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.