50 శాతం పెరిగిన 'స్విస్' డిపాజిట్లు...

50 శాతం పెరిగిన 'స్విస్' డిపాజిట్లు...

విదేశాలకు తరలిన నల్లధనాన్ని కేంద్రం వెనక్కితీసుకురావడం ఏమో గానీ... స్విస్ బ్యాంకులను మన కరెన్సీతో నింపేస్తున్నారు భారతీయులు. స్విస్ బ్యాంకులో నల్లకుభేరులు దాచుకున్న సొమ్ము ఒక్కసారిగా 50 శాతం పెరిగిపోయింది. ఈ లెక్క మొత్తం కేవలం గత ఏడాదికి మాత్రమే. విదేశాలకు తరలిన నల్లధనాన్ని పైసాపైసా కక్కిస్తామని కేంద్రం పదేపదే చెబుతోంది. గత ఎన్నికల్లో మోడీ దీనిని నినాదంగా ప్రచారం చేశారు. నల్లధనాన్ని కట్టడి చేసే దిశగా నాలుగేళ్లుగా కొన్ని చర్యలు తీసుకున్నా... ఫలితాలు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. స్విస్ బ్యాంక్ విడుదల చేసిన తాజా లెక్కలే ఇందుకు ఉదాహరణ. గతంతో పోలిస్తే పోయిన ఏడాది స్విస్ బ్యాంకుకు మనవాళ్లు డబ్బును బాగానే తరలించారు. 

2017 స్విస్ డిపాజిట్లను పరిశీలిస్తే భారతీయ ఖాతాల్లో సొమ్ము 50 శాతానికి పైగా పెరిగింది. 2017లో 50 శాతానికి పెరిగి రూ.7 వేల కోట్లకు చేరుకుంది. అంతకు ముందు మూడేళ్లలో కాస్త తగ్గుదల కనిపించినా... 2017లో మాత్రం భారతీయుల స్విస్ ఖాతాలు కలకలలాడిపోయాయి. భారతీయులు నల్లధాన్ని స్విస్ బ్యాంకుకు తరలించడకుండా కేంద్రం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు మాత్రం ఆశించినంత గొప్పగా ఏమీలేవనే చెప్పాలి. వాస్తవానికి 2016లో స్విస్‌ బ్యాంకులకు భారతీయులు తరలించిన మొత్తం అంతకు ముందు ఏడాదితో పోల్చితే 45 శాతం తగ్గి రూ.4,500 కోట్లకు చేరాయి. 2006 చివరి నాటికి భారత్‌కు చెందినవారు స్విస్‌ బ్యాంకుల్లో దాదాపు రూ. 23,000 కోట్ల సొమ్మును దాచుకున్నారు. అనంతర కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, సహా ఇతరత్రా కారణాలతో పదేళ్లలో ఈ మొత్తం పదో వంతుకు పడిపోయింది. కాగా 2011 తర్వాత స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల దాచుకున్న మొత్తాలు పెరగటం ఇది మూడోసారి. 2010తో పోలిస్తే 2011లో 12 శాతం, 2013లో 43 శాతం పెరిగాయి. 2017 వచ్చేసరికి 50 శాతం పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగా వంద దేశాలకు చెందిన నల్లకుభేరులు స్విస్ ఖాతాలకు లక్షల కోట్లు తరలిస్తుంటే అందులో భారతీయుల వాటా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. నల్లకుభేరుల జాబితాను పంచుకునేందుకు స్విట్జర్లాండ్ అంగీకరించడంతో బ్లాక్ మనీ స్విస్‌కు తరలదని, డిపాజిట్లు క్రమంగా తగ్గుతాయని కేంద్రం భావించింది. అక్రమ మార్గాల్లో అవినీతి సొమ్ము, ప్రభుత్వ లెక్కలకు అందని సొమ్ము, స్విస్ బాట పడుతూనే ఉంది. ప్రభుత్వ పెద్దల నుంచి బడా వ్యాపారవేత్తలు, ఆయుధాల బ్రోకర్ల వరకూ అంతా తమ అవినీతి సంపాదనకు సేప్ ప్లేస్‌గా భావిస్తున్నారు.