26 ఏళ్ల కనిష్ట స్థాయికి ప‌డిపోయిన బంగారం..!

26 ఏళ్ల కనిష్ట స్థాయికి ప‌డిపోయిన బంగారం..!

అస‌లే బంగారం ధ‌ర అంద‌నంత ఎత్తుకు ప‌రుగులు పెడుతుంటే.. 26 ఏళ్ల క‌నిష్ట‌స్థాయికి ప‌డిపోవ‌డం ఏంటి? అనే అనుమానం వెంట‌నే రావొచ్చు.. ప‌డిపోయింది నిజ‌మే... కానీ, బంగారం ధ‌ర కాదు.. దాని డిమాండ్‌.. బంగారం కోనేవారే లేర‌ట‌.. బంగారం అంటే ఎంతో ఇష్ట‌ప‌డే భార‌తీయులు ప‌సిడి కొనుగోలు చేయ‌డానికి ఆస‌క్తి చూప‌డం లేదు.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డ‌బ్ల్యూజీసీ) తాజాగా వెల్ల‌డించిన అంశాల‌ను ప‌రిశీలిస్తే.. భార‌త్‌లో బంగారం డిమాండ్ 2020లో ఏకంగా 26 ఏళ్ల కనిష్ట స్థాయికి ప‌డిపోయింద‌ని అంచ‌నా వేసింది. ఓవైపు అంత‌ర్జాతీయ ప‌రిస్థితులు బంగారం ధ‌ర పెర‌గ‌డానికి ఊతం ఇవ్వ‌డ‌గా.. కరోనా కార‌ణంగా డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం ప‌డింద‌ని డ‌బ్ల్యూజీసీ పేర్కొంది. 

భారత్‌లో బంగారం ధర ఆల్‌టైమ్ హైకి చేరి కొత్త రికార్డుల‌ను నెల‌కొల్పింది. దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది ఏకంగా 35 శాతానికి పైగా పెరిగింది. బంగారం ధరపై 12.5 శాతం దిగుమతి సుంకం, 3 శాతం జీఎస్టీ కూడా బాదేస్తున్నారు. దీంతో ఈ ఏడాది తొలి అర్థభాగంలో బంగారం డిమాండ్ భారీగా తగ్గిందని, దీని ప్రభావం మొత్తం ఏడాదిపై పడుతుందని డబ్ల్యూ‌జీసీ పేర్కొంది. 1994 నాటి 415 టన్నుల కనిష్ట స్థాయికి బంగారం దిగుమ‌తి పడిపోవచ్చని అంచనా వేసింది. ఈ ఏడాది తొలి అర్థభాగంలో ప‌సిడి డిమాండ్‌ 56 శాతం ప‌త‌న‌మైపోయింది. అది ఏకంగా 165 టన్నులకు దిగివచ్చింది. ఇక‌, లాక్ డౌన్ కారణంగా జూన్ త్రైమాసికంలో డిమాండ్ 70 శాతం పడిపోయింది. 63 టన్నులకు త‌గ్గిపోయింది. దశాబ్ద కాలంలో ఇదే కనిష్ట స్థాయి అని పేర్కొంది.