దేశంపై 50% రుణభారం పెంచిన మోడీ సర్కార్

దేశంపై 50% రుణభారం పెంచిన మోడీ సర్కార్

ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తన హయాంలో సాధించిన విజయాల గురించి ఢంకా బజాయిస్తుండవచ్చు గాక కానీ ఈ సర్కార్ పరిపాలన దేశంపై ఒక పెను భారాన్ని తెచ్చి నెత్తిన పెట్టింది. ఈ కష్టం రాబోయే ప్రభుత్వాలకు పెద్ద గుదిబండగా మారనుంది. మోడీ ప్రభుత్వ నాలుగున్నరేళ్ల పరిపాలనలో ప్రభుత్వం తెచ్చిన మొత్తం అప్పులు 50% పెరిగి రూ.82 లక్షల కోట్లకు చేరుకుంది. ఇటీవల ప్రభుత్వ రుణంపై జారీ చేసిన స్టేటస్ పేపర్ 8వ సంచిక ద్వారా ఈ విషయం వెల్లడైంది. 

కేంద్ర సర్కార్ పై మొత్తం ప్రభుత్వ రుణభారం రూ.82 లక్షల కోట్లు
ప్రభుత్వ రుణాలపై ఆర్థిక మంత్రిత్వశాఖ జారీ చేసిన డేటాలో సెప్టెంబర్ 2018 నాటి గణాంకాలతో పోల్చి చెప్పింది. దీని ప్రకారం సెప్టెంబర్ 2018 వరకు కేంద్ర ప్రభుత్వంపై మొత్తం రూ.82.03 లక్షల కోట్ల రుణభారం ఉంది. జూన్ 2014 వరకు ప్రభుత్వంపై మొత్తం రూ.54.90 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ విధంగా మోడీ సర్కార్ హయాంలో భారతదేశంపై ఇప్పుడు మొత్తం అప్పులు దాదాపుగా రూ.28 లక్షల కోట్లు పెరిగిపోయాయి.

పబ్లిక్ డెట్ లో ప్రభుత్వ రుణం పెరిగింది 
ఈ కాలంలో పబ్లిక్ డెట్ లో ప్రభుత్వ రుణం 51.7% పెరిగి రూ.48 లక్షల కోట్ల నుంచి రూ.73 లక్షల కోట్లు అయింది. మధ్యంతర రుణం 54% పెరుగుదలతో రూ.68 లక్షల కోట్లు కావడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.