ఫిబ్రవరిలో నిరుద్యోగ రేటు 7.2%కి పెరిగింది

ఫిబ్రవరిలో నిరుద్యోగ రేటు 7.2%కి పెరిగింది

భారత్ లో నిరుద్యోగ రేటు ఫిబ్రవరి 2019లో 7.2%కి పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) జారీ చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్ 2016 తర్వాత ఇదే గరిష్ఠ నిరుద్యోగ రేటు. గత ఏడాది ఫిబ్రవరి 2018లో నిరుద్యోగం 5.9%గా ఉంది.

సీఎంఐఈ ఈ గణాంకాలను మంగళవారం జారీ చేసింది. ఉద్యోగం వెతికేవారి సంఖ్య తగ్గుముఖం పట్టిన సమయంలోనూ నిరుద్యోగ రేటులో ఇంత భారీ పెరుగుదల నమోదైంది. గత ఏడాది ఫిబ్రవరిలో 40.6 కోట్ల మంది పని చేస్తుండగా ఈ ఏడాది ఆ సంఖ్య 40 కోట్లుగా ఉందని ముంబైకి చెందిన థింక్ ట్యాంక్ సంస్థకు చెందిన మహేష్ వ్యాస్ రాయిటర్స్ వార్తాసంస్థకు వివరించారు.

దేశవ్యాప్తంగా ఉన్న వేలాది కుటుంబాలపై జరిపిన సర్వే ఆధారంగా సీఎంఈఐ ఈ గణాంకాలను సేకరించి విపులంగా విశ్లేషించిన తర్వాత జారీ చేసింది. ప్రభుత్వ డేటా కంటే సీఎంఈఐ గణాంకాలను ఎక్కువ విశ్వసనీయమైనవిగా భావిస్తారు. ఈ ఏడాది మేలో లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో విడుదలైన ఈ గణాంకాలు మోడీ సర్కార్ కి పెద్ద చిక్కుల్లో పడేయవచ్చని భావిస్తున్నారు.