పార్టీలో అంతా మహిళలే.. ముంబైలో ప్రారంభమైన మొదటి మహిళా పార్టీ

పార్టీలో అంతా మహిళలే.. ముంబైలో ప్రారంభమైన మొదటి మహిళా పార్టీ

భారత్ లో మొట్టమొదటి అంతా మహిళల రాజకీయ పార్టీ..ది నేషనల్ వుమెన్స్ పార్టీ (ఎన్ డబ్ల్యుపీ) సోమవారం ముంబైలో ప్రారంభమైంది. ఈ లోక్ సభ ఎన్నికల్లో 545 సీట్లకు గాను ఈ పార్టీ 283 స్థానాల్లో పోటీ చేయనుంది. 'తల్లుల పార్టీ'గా చెప్పుకొంటున్న ఎన్ డబ్ల్యుపీని డాక్టర్, సామాజిక కార్యకర్త అయిన డాక్టర్ శ్వేతా శెట్టి స్థాపించారు. దిగువ సభలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కోసం ఈ పార్టీ కృషి చేయనుంది.

'పార్లమెంట్ లో మహిళలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలన్న మా లక్ష్యం సాధించేందుకు ఈ పార్టీ ఒక చారిత్రక అడుగు. రాజకీయాల్లో లైంగిక అసమానతను తొలగించి పితృస్వామ్య భారత సమాజంలో మహిళలకు సమాన ప్రాధాన్యత లభించేలా చేయడం మా ఉద్దేశమని' శెట్టి చెప్పారు. పార్లమెంట్ లో మహిళలకు రిజర్వేషన్ల పోరాటం ఇప్పటికి రెండు దశాబ్దాల నుంచి కొనసాగుతోందని, అయితే మనం ఇప్పటికీ రాజకీయ నిర్ణయాలు పురుషులే తీసుకొనే సమాజంలో జీవిస్తున్నందున ఇది సాధ్యం కావడం లేదు. పార్లమెంట్ లో మహిళల గొంతు సమానంగా వినిపించే అవకాశం లేదు. అందువల్ల మహిళా సాధికారత సాధించే అవకాశాలు క్షీణిస్తున్నాయని' తెలిపారు. 'ఈ పార్టీ స్థాపనతో ఎన్ డబ్ల్యుపీ మహిళల సర్వతోముఖాభివృద్ధికి తగిన వాతావరణం సృష్టించి తద్వారా వారి సంపూర్ణ సామర్థ్యాలను గుర్తించి సాధికార లక్ష్యాలను సాధించేలా చేయడమే' తమ ఉద్దేశమని శెట్టి అన్నారు.

త్వరలోనే ఎన్ డబ్ల్యుపీ 'మహిళా రక్షక్' అనే మొబైల్ యాప్ కూడా ప్రారంభించనుంది. ఈ యాప్ ద్వారా అత్యవసర సమయాల్లో విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న మహిళలకు సాయం అందిస్తారు. 'మహిళలపై పెరుగుతున్న నేరాలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో భద్రత అనేది అత్యంత ప్రాధాన్యతా అంశం' అని డాక్టర్ శెట్టి చెప్పారు. త్వరలోనే ఈ పార్టీ ఒక యూత్ పార్లమెంట్ ను ప్రారంభించనుంది. ఇందులో దేశంలోని ప్రతి రాష్ట్రానికి చెందిన మహిళలకు రాజకీయ శిక్షణ ఇస్తారు. విద్యావిషయికంగా, ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చి మహిళలు దేశ రాజకీయ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చేయనున్నట్టు తెలిపారు.