మొదటి లోక్ పాల్ గా పినాకి చంద్ర ఘోస్

మొదటి లోక్ పాల్ గా పినాకి చంద్ర ఘోస్

దేశ మొట్టమొదటి లోక్ పాల్ నియామకంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం ఆమోదముద్ర వేశారు. దీంతో సుప్రీంకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకీ చంద్ర ఘోస్ భారత రిపబ్లిక్ మొదటి లోక్ పాల్ అయ్యారు. మే 2017లో సుప్రీంకోర్ట్ నుంచి రిటైరైన జస్టిస్ ఘోస్ జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్ హెచార్సీ) సభ్యుడిగా ఉన్నారు.

లోక్ పాల్ ఎంపిక కోసం ఏర్పాటైన కమిటీ ఇందుకు 10 పేర్లను ఎంపిక చేసింది.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన గల లోక్ పాల్ ఎంపిక కమిటీ ఘోస్ పేరుకి సానుకూలంగా ఉన్నట్టు అధికార వర్గాలు ముందుగా చెబుతూ వచ్చాయి. కమిటీలో ప్రధానిమోడీతో పాటు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, ప్రఖ్యాత న్యాయనిపుణుడు ముకుల్ రోహత్గీ సభ్యులుగా ఉన్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు జస్టిస్ పీసీ ఘోస్ ని లోక్ పాల్ గా నియమిస్తున్నట్టు అధికార ప్రకటన చేయలేదు.

జస్టిస్ ఘోస్ ని లోక్ పాల్ గా నియమిస్తున్నట్టు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తే వివాదం రేగే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం ఎంపిక కమిటీ సమావేశాన్ని బహిష్కరించారు. లోక్ పాల్ చట్టం 2013లో ఆమోదం పొందింది. ఈ చట్టం కింద కొన్ని శ్రేణుల ప్రజా సేవకులపై అవినీతి దర్యాప్తు జరిపేందుకు కేంద్రంలో లోక్ పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలను నియమించడం వీలవుతుంది. 

అవినీతి వ్యతిరేక కార్యకర్త అన్నా హజారే లోక్ పాల్ నియామకంలో జాప్యానికి వ్యతిరేకంగా మరోసారి ఆందోళన ప్రారంభించారు. దీని తర్వాత లోక్ పాల్ కోసం ప్రకటన ఇవ్వడం జరిగింది. త్వరలోనే లోక్ పాల్ నియామకం జరుగుతుందన్న హామీ మేరకు ఆయన తన ఆందోళన విరమించారు.