కరోనా దెబ్బ... భారత వృద్ధి రేటు అబ్బా..!

కరోనా దెబ్బ... భారత వృద్ధి రేటు అబ్బా..!

దేశ ఆర్థిక వృద్ధి 11 ఏళ్ల కనిష్ఠ స్థాయికి చేరింది. 2019-20 పూర్తి ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 4.2 శాతంగా నమోదైంది. 2018-19 నాటి 6.1 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత అత్యంత స్తబ్దతకు గురైంది కూడా ఇప్పుడే. వినియోగం, పెట్టుబడులు తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. జాతీయ గణాంకాల కార్యాలయం - ఎన్‌ఎస్‌వో లెక్కల ప్రకారం.. జనవరి-మార్చి నాలుగో త్రైమాసికంలో వృద్ధి రేటు 3.1 శాతానికి పరిమితం అయింది. 2018-19 చివరి త్రైమాసికంలో వృద్ధి 5.7 శాతంగా నమోదైంది. ఆర్బీఐ 2019-20 ఏడాదికి వృద్ధి రేటు 5 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. ఎన్‌ఎస్‌వో కూడా... జనవరి, ఫిబ్రవరి ముందస్తు అంచనాల్లో 5 శాతంగానే అంచనా వేసింది. జీడీపీ వృద్ధి గణాంకాలు ఈ అంచనాలకంటే తక్కువగానే నమోదయ్యాయి. 

ఇక, అక్టోబరు-డిసెంబరు 2019-20లో వృద్ధి గణాంకాలను 4.7 శాతం నుంచి 4.1 శాతానికి సీఎస్‌వో సవరించింది. అలాగే తొలి, రెండో త్రైమాసికాలకు సంబంధించిన గణాంకాలను సైతం వరుసగా 5.6 శాతం, 5.1 శాతం నుంచి 5.2 శాతం, 4.4 శాతానికి మార్పులు చేసింది. ఇక.. 2019-20లో ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం రూ.1,34,226గా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం దేశ ద్రవ్యలోటు జీడీపీలో 4.6 శాతానికి పెరిగింది. ఇది ఏడేళ్ల గరిష్ఠ స్థాయి. ఆదాయ వసూళ్లు అధ్వానంగా ఉండడం ఇందుకు కారణం. ప్రభుత్వం సవరించిన అంచనాలైన 3.8 శాతం కంటే కూడా ఇది ఎక్కువే. కొవిడ్‌-19 ప్రభావం వల్ల జనవరి-మార్చిలో చైనా వృద్ధి 6.8 శాతం క్షీణించింది. భారత్‌ జీడీపీ ప్రస్తుత ఏడాదిలో 4 దశాబ్దాల్లోనే కనీవినీ ఎరుగని రీతిలో 5 శాతం క్షీణించవచ్చని ఫిచ్‌, ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్‌ సంస్థలు అంచనా వేశాయి. మరోవైపు.. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ పరిణామాలతో కీలక రంగాలు విలవిలలాడాయి. ఏప్రిల్‌లో ఎనిమిది ప్రధాన మౌలిక రంగాల ఉత్పత్తి -38.1 శాతం మేర క్షీణించింది. గతేడాది ఏప్రిల్‌లో ఈ రంగాల ఉత్పత్తి వృద్ధి రేటు 5.2 శాతం కాగా.. ఈ ఏడాది మార్చిలో ఉత్పత్తి -9 శాతం క్షీణించింది. ఏప్రిల్‌లో బొగ్గు ఉత్పత్తి -15.5 శాతం క్షీణించగా.. ముడి చమురు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల రంగాల ఉత్పత్తి వరుసగా -6.4 శాతం, -19.9 శాతం, -24.2 శాతం, -4.5 శాతం మేర పడిపోయింది. ఉక్కు, సిమెంటు, విద్యుత్‌ రంగాల ఉత్పత్తి వరుసగా -83.9 శాతం, -86 శాతం, -22.8 శాతం చొప్పున క్షీణించింది.