ఫిబ్రవరిలో 9.60 బిలియన్ డాలర్లకు తగ్గిన వాణిజ్య లోటు

ఫిబ్రవరిలో 9.60 బిలియన్ డాలర్లకు తగ్గిన వాణిజ్య లోటు

బంగారం, ముడి చమురుల దిగుమతులు తగ్గిన కారణంగా భారత వాణిజ్య లోటు తగ్గింది. ఫిబ్రవరిలో వాణిజ్య లోటు తగ్గి 9.60 బిలియన్ డాలర్లకు చేరింది. బంగారం, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు తగ్గడంతో వాణిజ్య లోటు తగ్గినట్టు వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. జనవరిలో దేశ వాణిజ్యలోటు 14.73 బిలియన్ డాలర్లుగా ఉంది. ఫిబ్రవరి 2018లో ఇది 12.3 బిలియన్ డాలర్లు. 

ఫిబ్రవరి నెలలో ఎగుమతుల్లో 2.44% వృద్ధిరేటు నమోదైంది. గత ఏడాది ఇదే కాలానికి 26.67 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. ఇదే సమయంలో 5.41%కి దిగుమతులు తగ్గాయి. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫిబ్రవరిలో దేశ దిగుమతుల బిల్లు 36.26 బిలియన్ డాలర్లకు చేరింది. 

ఫిబ్రవరిలో వార్షిక ప్రాతిపదికన బంగారం దిగుమతుల్లో 10.81% తగ్గుదల నమోదైంది. దీంతో ఇది 2.58 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయానికి 2.90 బిలియన్ డాలర్ల బంగారాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది.

పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు దాదాపుగా 8% తగ్గి 9.37 బిలియన్ డాలర్ల దగ్గర ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు ఎగుమతులు 8.85% పెరుగుదలతో 298.47 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 274.21 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ కాలంలో దేశ దిగుమతులు కూడా 422.76 బిలియన్ డాలర్ల నుంచి 9.75% పెరిగి 464 బిలియన్ డాలర్లకు చేరాయి.