ఐసీసీ వరల్డ్ కప్‌: రూ.100 కోట్లు కాపాడు వరుణదేవా!

ఐసీసీ వరల్డ్ కప్‌: రూ.100 కోట్లు కాపాడు వరుణదేవా!

ఐసీసీ వరల్డ్ కప్‌ 2019 భాగంగా జరుగుతోన్న మ్యాచ్‌లకు అప్పుడప్పుడు వరుణుడు అడ్డుపడుతూనే ఉన్నాడు. అయితే, వరుణదేవా..! మ్యాచ్‌లు అడ్డుకోవద్దు అంటూ ప్రతీ క్రికెట్ ప్రేక్షకుడు వేడుకుంటుండగా... ఇప్పుడు ఫ్యాన్స్‌తో పాటు బీమా సంస్థలు కూడా వరుణుడికి దండంపెడుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా మ్యాచ్‌లు ఆగకుండా చూడు స్వామీ అంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నాయి. బీమా సంస్థలు ఇంతలా ప్రార్థించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆలోచిస్తున్నారా? మ్యాచ్‌లు రద్దు అయితే.. రూ.100 కోట్ల వరకు నష్టం వాటిళ్లనుంది. సెమీ ఫైనల్స్‌కు ముందు భారత జట్టు ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ వర్షార్పణంకావటంతో బీమా కంపెనీలు తలపట్టుకున్నాయి. రానున్న రోజుల్లో జరిగే మ్యాచ్‌లు వర్షం కారణంగా నిలిచిపోతే రూ.100 కోట్లు చెల్లించక తప్పని పరిస్థితి. మ్యాచ్‌లు రద్దయితే ఐసీసీ బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కులను దక్కించుకున్న బ్రాడ్‌కాస్టర్స్‌కు బీమా కంపెనీలు.. క్లెయిమ్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. 

వివరాల్లోకి వెళ్తే వరల్డ్ కప్‌లో జరిగే ప్రతీ మ్యాచ్‌కు రూ.5 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు యాడ్స్ రెవెన్యూ వస్తుందని, దాని ఆధారంగానే సమ్‌ అష్యూర్డ్‌ ఉంటుందని బీమా పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేక మ్యాచ్‌లు అయిన సెమీ ఫైనల్స్‌, ఫైనల్స్‌ వంటి మ్యాచ్‌లకు అడ్వర్‌టైజ్‌మెంట్‌ రెవెన్యూ రూ.70-80 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే అండర్‌రైటర్స్‌ కింద భారీ మొత్తాలను బీమా కంపెనీలు చెల్లించాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు. అడ్వర్‌టైజ్‌మెంట్‌ రెవెన్యూకు దేశీయ బీమా కంపెనీలు కవరేజీని అందిస్తున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ ఆగిపోతే తగ్గిన ప్రకటనల ఆదాయాన్ని అండర్‌రైటర్‌ ద్వారా బీమా సంస్థలు ఆ మొత్తాన్ని కవర్‌ చేస్తాయి. అంటే, వర్షంతో మ్యాచ్ రద్దు అయితే మాత్రం బీమా సంస్థలు భారీ మొత్తంలో నష్టపోవాల్సి వస్తుంది. దీంతో ఆ వరుణుడికి దండం పెట్టుకుంటున్నాయి బీమా సంస్థలు. మరి వరుణుడు వారికి మొక్కలకు కనికరిస్తాడో? లేదో? చూడాలి.