కేరళ బాధితుల కోసం ఇందిర త్యాగం

కేరళ బాధితుల కోసం ఇందిర త్యాగం

‘నేను నా వాటా రేషన్ బియ్యాన్ని కేరళ ప్రజల కోసం వదులుకుంటున్నాను. అంతే కాకుండా నేను కేరళలో పరిస్థితి సాధారణానికి వచ్చే వరకు అన్నం తినను. వడ్డించనని ప్రమాణం చేస్తున్నాను.‘ ఇది భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1966లో విడుదల చేసిన ప్రమాణ పత్రం. ఈ విధంగా 1966 ఫిబ్రవరి నెలలో దక్షిణ భారతదేశంలో అత్యంత జనసాంద్రత గల కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తినపుడు బాధితుల కష్టాలు తను అర్థం చేసుకోగలనని, వారికి సానుభూతిని తెలిపేందుకు ఆమె ఆచరణలో చూపిన మాటలు. ఈ ప్రమాణ పత్రంలోని పదాలు వరద బాధితుల కష్టాలు తీర్చకపోవచ్చు. అన్నమో రామచంద్రా అని అలమటించే కడుపుల ఆకలి తీర్చకపోవచ్చు. అధికార యంత్రాంగం వైఫల్యంపై రగిలే ఆగ్రహజ్వాలలను చల్లార్చకపోవచ్చు. కానీ దేశప్రధాని చొరవచూపి ఓ అడుగు ముందుకేస్తే పలువురు అదే బాటన నడిచే అవకాశాలు ఎక్కువని గుర్తించిన ఇందిర కేరళను ఆదుకుందామని దేశప్రజలకు పిలుపునివ్వకుండా అనుకున్న మాటను ఆచరణలో పెట్టిన తీరిది. ఐదు దశాబ్దాల క్రితం నాటి ఈ ప్రమాణ పత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.