డిసెంబర్ లో 2.4%కి పరిమితమైన పారిశ్రామికోత్పత్తి వృద్ధి

డిసెంబర్ లో 2.4%కి పరిమితమైన పారిశ్రామికోత్పత్తి వృద్ధి

డిసెంబర్ 2018లో దేశ పారిశ్రామికోత్పత్తి రేటు 2.4%కి పరిమితమైంది. మైనింగ్ విభాగంలో ఉత్పత్తి తగ్గుదల, ఉత్పాదక రంగం పేలవ ప్రదర్శనే దీనికి కారణంగా చెబుతున్నారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచి (ఐఐపి) ఆధారంగా వేసిన అంచనా ప్రకారం 2017 డిసెంబర్ లో ఫ్యాక్టరీ ఉత్పత్తి 7.3% పెరిగిందని ఫిబ్రవరి 12న సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్ఓ) విడుదల చేసిన డేటా తెలిపింది. నవంబర్ 2018లో పారిశ్రామిక వృద్ధిరేటు 0.5%గా అంచనా వేయగా సవరించిన అంచనాల ప్రకారం అది 0.3%గా ఉందని జనవరి 2019లో విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.

ఏప్రిల్-డిసెంబర్ 2018 మధ్య కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి 4.6% వృద్ధిని నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఇది 3.7%గా ఉంది. సూచీలో 77.63% ఉండే ఉత్పాదక రంగం డిసెంబర్ లో కేవలం 2.7% వృద్ధిరేటు మాత్రమే నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే నెలలో ఇది 8.7%గా నమోదైంది. డిసెంబర్ లో మైనింగ్ రంగం ఉత్పత్తి 1% క్షీణించింది. డిసెంబర్ 2017లో ఇది 1.2% వృద్ధిని సాధించింది. డిసెంబర్ 2018లో విద్యుత్ రంగం ఉత్పత్తి నిలకడగా 4.4% మాత్రమే పెరిగింది.

క్యాపిటల్ వస్తూత్పత్తులు 5.9% పెరిగాయి. అంతకు ముందు ఏడాదిలో వీటి వృద్ధిరేటు 13.2%గా ఉంది. కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పాదకత 2.9% పెరిగింది. డిసెంబర్ 2017లో ఇది 2.1%. గత ఏడాది డిసెంబర్ లో వినియోగదారుల నిరర్థక వస్తువుల (కన్జూమర్ నాన్-డ్యూరబుల్ గూడ్స్) వృద్ధి 5.8%గా నమోదైంది. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో 16.8%గా నమోదైంది.

పరిశ్రమల పరంగా, డిసెంబర్  2018లో ఉత్పాదక రంగంలోని 23 పరిశ్రమ వర్గాల్లో 13 సానుకూల వృద్ధిని సాధించాయి. వినియోగ ఆధారిత వర్గీకరణ ప్రకారం, ప్రాథమిక వస్తూత్పత్తి 1.2% తగ్గగా ఇంటర్మీడియట్ వస్తువులు 1.5% తగ్గాయి. మౌలిక వసతులు/నిర్మాణ వస్తువులు 10.1% పెరిగాయి.