పారిశ్రామిక వృద్ధి మళ్లీ దిగువకు..

పారిశ్రామిక వృద్ధి మళ్లీ దిగువకు..

పారిశ్రామిక రంగం మరోసారి తిరోగమనం బాట పట్టింది. మార్చి నెలలో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధిరేటు నిరాశపరిచింది. ఐదు నెలల్లోనే తక్కువగా 4.4 శాతంగా నమోదయ్యింది. క్యాపిటల్‌ గూడ్స్, మైనింగ్‌ పనులు తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం. 2017 అక్టోబరులో ఐఐపీ కనిష్ఠంగా 1.8 శాతానికి చేరింది. 2016-17లో 4.6 శాతం నమోదైన పారిశ్రామికోత్పత్తి సూచీ.. గత ఆర్థిక సంవత్సరం (2017-18)లో 4.3 శాతానికి పరిమితమైంది. కేంద్ర గణక కార్యాలయం (సీఎస్‌ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
సూచీలో దాదాపు 77 శాతం వాటా కలిగిన తయారీ రంగం వృద్ధి రేటు మార్చిలో 3.3 శాతం నుంచి 4.4 శాతానికి పెరిగింది.

 
మైనింగ్‌ రంగం ఉత్పత్తి 2.8 శాతానికి దిగజారింది.
విద్యుత్‌ రంగంలో వృద్ధి  6.2 శాతం నుంచి 5.9 శాతానికి పడిపోయింది.
భారీ యంత్రపరికరాల రంగాల వృద్ధి రేటు 1.8 శాతానికి పడిపోయింది. 
ఫ్రిజ్‌లు, టీవీలు, వాషింగ్‌ మెషీన్ల వంటి కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ వృద్ధి 0.6% నుంచి 2.9%కి పెరిగింది.
సబ్బులు, టూత్‌పేస్టులు, షాంపూలు వంటి ఎఫ్‌ఎంసీజీ విభాగంలో వృద్ధి రేటు 7.5 శాతం నుంచి 10.9 శాతానికి పెరిగింది.


2017-18 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే.. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 4.6 శాతం నుంచి 4.3 శాతానికి పడిపోయింది. తయారీ రంగం వృద్ధి రేటు 4.4 శాతం నుంచి 4.5 శాతానికి పెరిగింది.