ఆహారంలో అవి ఎక్కువైనా తక్కువైనా చావే

ఆహారంలో అవి ఎక్కువైనా తక్కువైనా చావే

తిండిలో పిండిపదార్థాలు తగ్గించాలని, తగినంత మోతాదులో తినాలని సాధారణంగా డైటీషియన్లు, న్యూట్రిషనిస్టులు సలహా ఇస్తుంటారు. అలా చేయకపోతే త్వరగా చనిపోతారని ఇటీవలే నిర్వహించిన ఓ అధ్యయనంలో స్పష్టమైంది. ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు తీసుకున్నా లేదా అతి స్వల్పంగా తిన్నా త్వరగా మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ఆ అధ్యయనం తేల్చి చెప్పింది. ఇది ఎక్కడో ఒక్క పరిశోధనలో తెలిసిన విషయం కానే కాదు. ఎనిమిది వేర్వేరు అధ్యయనాలు జరుపగా అన్నిటిలో ఇవే ఫలితాలు కనిపించాయని చెబుతూ లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నల్ కథనం ప్రచురించింది.

ఆరోగ్యకరమైన ఆయు:ప్రమాణం కోసం తగినంత మోతాదులో పిండిపదార్థాలను ఆహారంగా తీసుకోవడం అత్యావశ్యకమని అధ్యయనం స్పష్టం చేసింది. 40 శాతం కంటే తక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకున్నా 70 శాతం కన్నా ఎక్కువ పిండిపదార్థాలు తిన్నా త్వరగా మరణం సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పింది. తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాలన్నీ ఒకేలా ఉండవని ద గార్డియన్ హెచ్చరించింది. అవకాడో, గింజలు, చిక్కుళ్లు వంటి ఆహారం ద్వారా ప్రొటీన్ తీసుకొనే వారితో పోలిస్తే ఎక్కువగా చికెన్, గొర్రె మాంసం, తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఆహారం తీసుకొనే వారిలో మరణాల ప్రమాదం అధికంగా ఉంటుందని అధ్యయనంలో గుర్తించారు.

‘బరువు తగ్గేందుకు తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారానికి బదులు ప్రొటీన్, కొవ్వు అధికంగా ఉన్న ఆహారం తీసుకొనడం పెరుగుతోంది. ఉత్తర అమెరికా, యూరప్ లలో జంతు ఆధారిత తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకోవడం ఎక్కువ. దీని కారణంగా ఆయు:ప్రమాణం బాగా తగ్గిపోతోంది. దీనిని తగ్గించుకోవాలి. తక్కువ పిండిపదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవాలని అనుకొంటే వృక్ష ఆధారిత కొవ్వులు, ప్రొటీన్లను తినాలి. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యకరంగా వృద్ధాప్యం గడిపేందుకు సహాయ పడుతుంద’ని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ సారా సీడెల్మన్ తెలిపారు. 

పౌష్టికాహారం తీసుకోవడంపై ఇప్పుడు అందరూ శ్రద్ధ వహిస్తున్నారు. కానీ ఏం తినాలో, ఎలా తినాలో, ఎంత తినాలో తెలియక గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒకరోజు ఎక్కువ పిండిపదార్థాలు తింటే మంచిదని, మర్నాడు తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం మంచిదని చెబుతున్నారు. కానీ శరీర తత్వానికి తగిన ఆహారం ఏదో తెలుసుకొని తింటే ఆరోగ్యకరమైన జీవితం గడపగలుగుతారు.