బయటపడుతున్న ఇంటర్ బోర్డ్ లీలలు

బయటపడుతున్న ఇంటర్ బోర్డ్ లీలలు

ఇంటర్‌ ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం నెలకొనడంతో తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు పని తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షల నిర్వహణ సమయంలో ఎన్నో అవకతవకలు జరిగినట్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి నెలకొనడంతో ఇన్ని రోజులు ఇంటర్మీడియట్ తప్పులు బయటపడలేదు. పరీక్ష కేంద్రాలకు ఒక ప్రశ్నాపత్రానికి బదులు మరోకటి పంపినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ పాతబస్తీలోని శ్రీ గాయత్రీ కళాశాలలో విద్యార్ధులు ఒక లాంగ్వేజ్ ను ఎంచుకుంటే.. ఆ ప్రశ్నాపత్నాన్ని కనీసం పరీక్ష కేంద్రానికి పంపకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో నాలుగు రోజుల పాటు ప్రతి రోజు 160 పేపర్ లను నాంపల్లిలోని ఇంటర్ బోర్డ్ నుంచి కళాశాలకు చేరవేశారు అధికారులు. వరంగల్ జిల్లా నర్సంపేటలో అయితే మరి దారుణం. ప్రతి రోజు వరంగల్ లో పేపర్ ను స్కాన్ చేసి మెయిల్ చేస్తే నర్సంపేటలో జీరాక్స్ తీసి విద్యార్ధులకు అందచేశారు. ఇలా చాలా పరీక్షా కేంద్రాల్లో సరిపడ ప్రశ్నాపత్రాలు పంపకపోవడంతో జీరాక్స్ తీసి విద్యార్ధులకు అందచేశారు. దీనికి ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణమని స్పష్టంగా తెలుస్తుంది. డేటా అప్ లోడ్ చేయడంలో అలసత్వం ప్రదర్శించారని అర్ధమవుతుంది. దీంతో ఇంటర్ ఫలితాల విడుదలలో జాప్యం నెలకొంది. బోర్డు తీరుపై విద్యార్ధి సంఘాలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ నెల 18న ఇంటర్‌ ఫలితాలను విడుదల చేస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యామండలి ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ పత్రికా ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇంటర్‌ వార్షిక పరీక్షలు 2019 ఫలితాల ప్రక్రియ తుది దశకు చేరుకున్నాయని.. ఈ నెల 18న ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొన్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇంటర్ పరీక్షలు ఒకేసారి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో గత శుక్రవారం ఫలితాలను విడుదల చేసింది.