60 ఏళ్ళ 'ఇంటికి దీపం ఇల్లాలే' 

60 ఏళ్ళ 'ఇంటికి దీపం ఇల్లాలే' 

తెలుగునాట యన్టీఆర్, బి.సరోజాదేవి జోడీకి ఓ స్పెషల్ క్రేజ్ ఉండేది.  తమ సొంత చిత్రం 'పాండురంగ మహాత్మ్యం'తో సరోజాదేవిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేసింది యన్టీఆరే. ఇక రామారావు దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'సీతారామకళ్యాణం'లోనూ సరోజాదేవియే ఆయన సరసన నాయికగా నటించారు. 'సీతారామకళ్యాణం' విడుదలైన 20 రోజులకు యన్టీఆర్, సరోజాదేవి జంటగా నటించిన 'ఇంటికి దీపం ఇల్లాలే' విడుదలయింది. అంటే 1961 జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా జనం ముందు నిలచింది. 

తీరును మార్చిన పేర్లు
చాలామంది ఇళ్ళలో దాదాపు ఒకే పేరుతో ఉన్నవారిని పెద్దోడు, చిన్నోడు అని పిలుస్తూ ఉంటారు. 'ఇంటికి దీపం ఇల్లాలే' కథలోనూ రాజశేఖర్, చంద్రశేఖర్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. పెద్ద శేఖర్, చిన్న శేఖర్ గా వారిద్దరూ ఊరిలో వారికి తెలుసు. జమీందార్ బిడ్డలయిన రాజశేఖర్ , చంద్రశేఖర్ భిన్నధ్రువాల్లాంటి వారు. రాజశేఖర్ తాగుడుకు బానిసై ఊళ్ళోనే తిరుగుతూ ఉంటాడు. చంద్రశేఖర్ పట్నంలో డాక్టర్ గా పనిచేస్తుంటాడు. పెళ్ళయితే పెద్ద కొడుకు బాగుపడతాడని తల్లి భావిస్తుంది. అదే సమయంలో రైలులో పరిచయమైన సుగుణ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు చంద్రశేఖర్. ఆమె కూడా అతనంటే ఇష్టపడుతుంది. ఆమె తండ్రి వెళ్ళి  శేఖర్ తల్లితో మాట్లాడతాడు. ఇద్దరి పేర్లూ ఒకటేలా ఉండడంతో సుగుణ కూడా పెళ్ళికొడుకు తను ప్రేమించిన శేఖరే అనుకుంటుంది. చివరి నిమిషంలో విషయం తెలుస్తుంది. తండ్రి పరువుకోసం తాళి కట్టించుకుంటుంది. పెళ్ళికి వచ్చే క్రమంలో చంద్రశేఖర్ ప్రమాదానికి గురవుతాడు. తరువాత ఇంటికి వచ్చి, తాను ప్రేమించిన సుగుణనే తన అన్నభార్య అని తెలుసుకుంటాడు. వారిద్దరి మధ్య అంతకు ముందే బంధం ఉందని తెలుసుకున్న రాజశేఖర్ వాళ్ళను చంపాలనుకుంటాడు. అదే సమయంలో ఆ అన్నదమ్ముల తల్లి మరణిస్తుంది. ఆమె చనిపోతూ ఆస్తి మొత్తం కోడలు సుగుణ పేరిట రాస్తుంది. చివరకు అన్నకు అసలు నిజం తెలిసేలా చేస్తాడు చంద్రశేఖర్. దాంతో తప్పు తెలుసుకున్న రాజశేఖర్ భార్యను క్షమించమంటాడు. అదే సమయంలో చంద్రశేఖర్ ను ప్రేమించిన మాలతి అనే అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. ఆమెను రక్షించి చంద్రశేఖర్ పెళ్ళి చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. 

నటీనటులు
ఈ చిత్రంలో రాజశేఖర్ గా యన్టీఆర్, ఆయన తమ్ముడు చంద్రశేఖర్ గా జగ్గయ్య , వారి తల్లిగా కన్నాంబ నటించారు. సుగుణ పాత్రలో బి.సరోజాదేవి, మాలతిగా ఇ.వి. సరోజ అభినయించారు. మిగిలిన పాత్రలలో చిత్తూరు నాగయ్య, రేలంగి, గిరిజ, రమణారెడ్డి, వంగర, బొడ్డపాటి, మాలతి కనిపించారు. 

సాంకేతిక నిపుణులు
'ఇంటికి దీపం ఇల్లాలే' చిత్రానికి ఆచార్య ఆత్రేయ రచన చేయగా, ఆత్రేయ, శ్రీశ్రీ పాటలు రాశారు. విశ్వనాథన్- రామ్మూర్తి సంగీతం సమకూర్చారు. ఆర్.ఆర్. పిక్చర్స్ పతాకంపై టి.ఆర్. రామన్న ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు వి.యన్.రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో యన్టీఆర్ పై చిత్రీకరించిన పి.బి.శ్రీనివాస్ పాడిన  "ఎవరికి ఎవరూ కాపలా..." పాట ఆ రోజుల్లో జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఇక "నీవే నీవే కావలసింది..." , "ఒకే రాగం... ఒకే తాళం...", "వినుము చెలీ తెలిపెదనే... పరమ రహస్యం..." పాటలు కూడా విశేషంగా అలరించాయి. 

జనం మెచ్చిన కథ
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించారు. తమిళంలో ఈ చిత్రం పేరు 'మనపందాల్'. అందులో యన్టీఆర్ పాత్రను అశోకన్ పోషించగా, జగ్గయ్య  పాత్రలో ఎస్.ఎస్. రాజేంద్రన్ నటించారు.  అందులోనూ సరోజాదేవి, ఇ.వి. సరోజ నాయికలుగా అభినయించారు. 'మనపందాల్' చిత్రం 1961 జనవరి 14న పొంగల్ కానుకగా విడుదలయింది. అయితే తెలుగులో రిపబ్లిక్ డేన విడుదల చేశారు. అసలు ఈ సినిమా కథకు మూలం హాలీవుడ్ మూవీ 'సబ్రినా' (1954) ఆధారం. ఆ సినిమాకు సామూయేల్ ఏ. టేలర్ రాసిన 'సబ్రినా ఫెయిర్' నాటకం స్ఫూర్తి. బిల్లీ వైల్డర్ తెరకెక్కించిన 'సబ్రినా'లో హంఫ్రీ బోగార్ట్, ఆడ్రే హెబ్బర్న్, విలియమ్ హోల్డెన్ నటించారు. హాలీవుడ్ లో మంచి విజయం సాధించిన ఈ కథతోనే మన 'ఇంటికి దీపం ఇల్లాలే' చిత్రం కూడా విజయాన్ని చేజిక్కించుకుంది.