‘జీ’తో ఇన్వెస్కో డీల్‌..

‘జీ’తో ఇన్వెస్కో డీల్‌..

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో వాటా కొనుగోలు పలు సంస్థలు ఆసక్తి చూపినా.. చివరకు ఇప్పటికే జీలో వాటా కలిగిఉన్న అమెరికాకు చెందిన ఇన్వెస్కో మరింత ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమైంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రమోటర్ల నుంచి మరో 11 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ డీల్‌ విలువ రూ. 4,224 కోట్లుగా ఉండనుంది. ఇన్వెస్కో ఓపెన్‌హైమర్‌లో భాగమైన డెవలపింగ్‌ మార్కెట్స్‌ ఫండ్‌.. జీ వాటాలను కొనుగోలు చేయనుంది. కాగా, 'జీ'తో 17 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉంది ఇన్వెస్కో ఫండ్‌కు.. 2002 నుంచి జీ లో ఇన్వెస్టరుగా కొనసాగుతున్న ఇన్వెస్కో ఫండ్‌కు ప్రస్తుతం జీలో 7.74 శాతం వాటాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రమోటర్ల నుంచి మరో 11 శాతం వరకు వాటాల కొనుగోలుకు అంగీకరించింది. తాజా డీల్‌తో జీ లో ప్రమోటర్ల వాటా 23 శాతానికి తగ్గుతుంది. మరోవైపు ఈ ఏడాది జూన్‌ నాటికి జీ లో ప్రమోటర్ల వాటా 35.79 శాతంగా ఉంది. ఇందులో 63.98 శాతం వాటాలు మ్యూచువల్‌ ఫండ్స్, ఇతర ఆర్థిక సంస్థల దగ్గర తనఖాలో ఉన్నాయి. ప్రస్తుతం జీ మార్కెట్‌ విలువ రూ. 34,717 కోట్లు కాగా.. ఇందులో ప్రమోటర్ల వాటాల విలువ సుమారు రూ. 13,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు.