పుల్వామా ఎఫెక్ట్‌: భారత్‌కు షాకిచ్చిన ఒలింపిక్‌ కమిటీ..

పుల్వామా ఎఫెక్ట్‌: భారత్‌కు షాకిచ్చిన ఒలింపిక్‌ కమిటీ..

పుల్వామా ఉగ్రవాద దాడి భారత్-పాకిస్థాన్ మధ్య చిచ్చుపెట్టడమే కాదు... భారత్‌పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మండిపడేలా చేసింది. ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు వచ్చే పాక్ షూటర్లకు భారత్ వీసాలు నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐవోసీ... భారత్‌ నిర్ణయంతో భవిష్యత్‌లో అంతర్జాతీయ క్రీడాపోటీలకు ఆతిథ్యం ఇచ్చే విషయమై ఇండియాతో చర్చలు నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఢిల్లీలో జరగనున్న ప్రపంచకప్‌ పోటీల నుంచి పురుషుల 25 మీటర్ల రాపిడ్ ఫైర్‌ ఈవెంట్‌కు ఒలింపిక్‌ అర్హత హోదాను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. భారత్‌ తీరును తప్పుబట్టిన ఐవోసీ... అంతర్జాతీయ క్రీడా పోటీల్లో అన్ని దేశాల అథ్లెట్లను, క్రీడా ప్రతినిధులను సమానంగా చూడాలంది. అథ్లెట్ల మధ్య ఆతిథ్య దేశం ఎలాంటి వివక్ష చూపరాదని, ఆ దేశ రాజకీయ జోక్యం కూడా ఉండ కూడదని స్పష్టం చేసింది. ఇండియా ఈ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినదుకే ఆ దేశంతో చర్చలు నిలిపివేసేందుకు నిర్ణయించినట్లు తెలిపింది. ఇకపై ఒలింపిక్‌ నిబంధనలకు అనుగుణంగా వివిధ దేశాల పోటీదారులకు అనుమతి ఇస్తామని భారత సర్కార్ నుంచి లిఖితపూర్వకమైన హామీ వచ్చేంత వరకు ఒలింపిక్‌ సంబంధింత పోటీల నిర్వహణకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ.