ఐపీఎల్‌: వార్నర్‌ హాఫ్ సెంచరీ

ఐపీఎల్‌: వార్నర్‌ హాఫ్ సెంచరీ

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ హాఫ్ సెంచరీ బాదాడు. దీంతో ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్నా.. తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. మార్చి 23 నుండి ఐపీఎల్‌–12వ సీజన్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఇక ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈనెల 29న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అనంతరం 31న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్‌ ఆటగాళ్లంతా గత మూడు రోజులుగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు.

ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ఇంట్రా స్క్వాడ్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్‌ 'ఎ', 'బి' జట్లు పాల్గొన్నాయి. 'ఎ' జట్టుకు ప్రాతినిధ్యం వహించిన డేవిడ్‌ వార్నర్ (38 బంతుల్లోనే 68) హాఫ్ సెంచరీ చేసాడు. మ్యాచ్ మొదటి నుంచి వార్నర్ బౌండరీలతో చెలరేగాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం కారణంగా ఏడాది పాటు నిషేధానికి గురైనా కూడా హాఫ్ సెంచరీతో రాణించడంతో సన్‌రైజర్స్‌ యాజమాన్యం ఆనందంలో మునిగితేలుతోంది.

వార్నర్ కి తోడు మనీశ్‌ పాండే (43 బంతుల్లో 67), దీపక్‌ హుడా (27 బంతుల్లో 55) హాఫ్ సెంచరీలతో రాణించడంతో సన్‌రైజర్స్‌ 'ఎ' జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్‌ 'బి' జట్టు మరో 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. వెటరన్ స్టార్ యూసుఫ్‌ పఠాన్‌ (30 బంతుల్లో 68), రికీ భుయ్‌ (29 బంతుల్లో 65)లు ఆకట్టుకున్నారు.