సమరం సై.. నువ్వా..? నేనా..?

సమరం సై.. నువ్వా..? నేనా..?

ఐపీఎల్‌ 2019 సీజన్‌లో ఫైనల్ ఫైట్‌కు రెడీ అయ్యాయి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టీమ్‌లు.. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై, ముంబై జట్లు.. ఇప్పుడు మరోసారి టైటిల్ రేస్‌లో నిలబడ్డాయి. ఢీ అంటే ఢీ అంటే ఇవాళ ఫైనల్ ఫైట్‌కు రెడీ అయ్యాయి. క్వాలిఫైయర్ -1 మ్యాచ్‌లో ముంబై చేతిలో చావుదెబ్బ తిన్న చెన్నై.. క్వాలిఫైయర్ -2లో సత్తా చాటి ఫైనల్‌లో అడుగుపెట్టింది. మళ్లీ ముంబైతోనే సమరానాకి రెడీ అయ్యింది. ఈ సీజన్‌లో మొదట్లో తడబడిన ముంబై... ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. వరుస విజయవాలతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించింది. గ్రూప్ స్టేజ్‌లో 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న రోహిత్ సేన.. మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చెన్నైని ఓడించి సగర్వంగా ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇప్పటికే మూడు ఐపీఎల్ టోర్నీలు కైవసం చేసుకున్న ముంబై.. ఇప్పుడు నాల్గో టైటిల్‌పై కన్నేసింది. రోహిత్ సేన విజయాల్లో కీరోల్ మాత్రం హార్ధిక్ పాండ్యాదే.. పవర్ హిట్టింగ్‌తో ముంబైకి అద్భుతమైన విజయాలు అందించాడు ఈ ఆల్ రౌండర్.. పొలార్డ్ కూడా అవకాశం వచ్చిన ప్రతీసారి సత్తా చాటుతూనే ఉన్నాడు. ఇక బౌలింగ్‌లో బుమ్రా, మలింగ లాంటి టాప్ క్లాస్ బౌలర్లు ముంబై సొంతం. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ముంబై..  నాల్గో సారి కప్ ఎగురేసుకుపోతామనే ధీమాతో ఉంది. 

ఇక చెన్నై జట్టులో అందరూ సీనియర్ ఆటగాళ్లే.. కుర్రాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా రాణిస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ధోనీ సేన ఈ సీజన్‌లో 9 విజయాలతో గ్రూప్ స్టేజ్‌లో రెండో స్థానంలో నిలిచింది. చెన్నై విజయాల్లో కీలక పాత్ర మాత్రం మిస్టర్‌ కూల్‌దే. జట్టు ముందుండి నడిపించడంలో ధోనీ దిట్ట.. ఇండియా పిచ్‌లపై ధోనీకి ఉన్న అవగాహన మరి ఏ ఇతర కెప్టెన్లకు లేదు. పైగా బెస్ట్ ఫినిషర్ కూడా అతడే.. ప్రత్యర్థులను మట్టికరిపించే వ్యూహాలను రచిచండంలో ధోనీకి ధోనీయే సాటి. ఇప్పటికే ఐపీఎల్ టోర్నీని మూడుసార్లు ముద్దాడిన ధోనీ సేన.. నాల్గోసారి టైటిల్ వేటలో ఫేవరేట్‌గా ఉంది. చెన్నై-ముంబై ఫైనల్‌లో తలపడడం ఇది నాల్గోసారి. ఇరు జట్లలో ఎవరు గెలిచినా... రికార్డు స్థాయిలో నాల్గో కప్‌ వారి ఖాతాలో చేరుతుంది. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు హైదరాబాద్ సిద్ధమైంది.. ఇవాళ జరగబోయే ఫైనల్ మ్యాచ్‌ను స్వయంగా వీక్షించేందుకు తెలుగురాష్ట్రాల నుంచే కాదు.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే ఫ్యాన్స్ హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఫ్యాన్స్ తాకిడి ఉండడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాచకొండ పోలీసులు... కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.