'ఐపీఎల్‌' ప్రారంభ వేడుకలు రద్దు

'ఐపీఎల్‌' ప్రారంభ వేడుకలు రద్దు

ఈ సంవత్సరం జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్-12) సీజన్‌ ప్రారంభ వేడుకలు రద్దయ్యాయి. ఐపీఎల్ ప్రారంభ కార్యక్రమానికి కేటాయించిన డబ్బును పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఇవ్వనున్నట్లు సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు. శుక్రవారం బీసీసీఐ, సీఓఏ అధికారులు సమావేశమయ్యారు. ఐపీఎల్‌కు చెందిన ఓ అధికారి ప్రారంభ వేడుకలకు వెచ్చించే డబ్బును జవాన్ల కుటుంబాలకు ఇద్దామని సీఓఏ సభ్యులకు తెలిపాడు. దీనికి సీఓఏతో పాటు బీసీసీఐ అధికారులు కూడా అంగీకరించారు. దీంతో ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్‌ జవాన్ల గౌరవార్థం ఈ సారి ప్రారంభ వేడుకలు రద్దు చేశారు.

'ఈ సంవత్సరం ఐపీఎల్‌ ప్రారంభ వేడుక నిర్వహించడం లేదు. అందుకు కేటాయించిన డబ్బును అమరుల కుటుంబాలకు అందజేస్తాం' అని సీఓఏ చైర్మన్ వినోద్‌ రాయ్‌ తెలిపారు. మార్చి 23న ఐపీఎల్‌ 12వ సీజన్ ఆరంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడనున్నాయి.