ఫైనల్‌ బెర్త్‌ కోసం ముంబై-చెన్నై ఢీ..

ఫైనల్‌ బెర్త్‌ కోసం ముంబై-చెన్నై ఢీ..

ఐపీఎల్‌-12లో ఆఖరి అంకానికి ఇవాళ తెర లేవనుంది. క్వాలిఫయర్‌-1లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. చెన్నైలోని చెపాక్‌ మైదానంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్‌.. రోహిత్‌ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్‌ రెండూ బలమైన జట్లే అయినందున రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. లీగ్‌ దశలో చెరో 14 మ్యాచులాడిని చెన్నై, ముంబై జట్లు.. తొమ్మిదేసి విజయాలు నమోదు చేశాయి. బ్యాటింగ్‌లో ఏమాత్రం నిలకడ కనిపించకపోవడం చెన్నై జట్టును ఆందోళనపరుస్తుండగా.. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో భీకరంగా కనిపిస్తూ ముంబై ఇండియన్స్‌ జోష్‌లో ఉంది. 

చెపాక్‌ మైదానంలో ఇరు జట్ల మధ్య 7 మ్యాచ్‌లు జరగ్గా, ముంబై 5 సార్లు, చెన్నై 2 సార్లు నెగ్గాయి. ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ను రెండు సార్లు తలపడగా.. రెండు మ్యాచుల్లోనూ ముంబైనే విజయం వరించింది. ఈ నేపథ్యంలో ధోనీ సేన ఓటములకు ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా విన్నింగ్‌ స్ట్రీక్‌ను ముంబై కొనసాగిస్తుందా అనేది చూడాలి. ఇక.. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టుకు ఫైనల్‌ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. ఇవాళ ఓటమి చెందిన జట్టు.. ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య విశాఖపట్నంలో జరిగే ఎలిమినేటర్‌లో విజేతతో తలపడనుంది.