ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ఫైనల్‌ పంచ్‌

ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ఫైనల్‌ పంచ్‌

ఆఖరి మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అదరగొట్టింది. టోర్నీ నుంచి వెళ్తూవెళ్తూ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. తద్వారా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్‌ అవకాశాల్ని దాదాపు దెబ్బ తీసింది. ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. 

 చినసామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో  టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(70; 43 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్స్‌లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా(20; 11 బంతుల్లో 4ఫోర్లు), మార్టిన్‌ గప్తిల్‌(30; 23 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్స్‌లు) ధాటిగా ఆడి తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ఈ క్రమంలో సాహా, గప్తిల్‌, మనీశ్‌పాండే(9) త్వరగానే పెవిలియన్ చేరారు. తర్వాత వచ్చిన విలియమ్సన్‌, విజయ్‌శంకర్‌(27; 18 బంతుల్లో 3సిక్స్‌లు) చక్కగా రాణించారు. ఆఖరి ఓవర్‌లో విలియమ్సన్‌ ధాటిగా ఆడి బౌండరీలతో చెలరేగడంతో బెంగళూరుకు భారీ టార్గెట్ ను నిర్దేశించాడు. బెంగళూరు బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ మూడు, నవ్‌దీప్‌ సైనీ రెండు వికెట్లు తీయగా చాహల్‌, కుల్వంత్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

176 పరగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆర్‌సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 20 పరుగులకే పార్థివ్‌ (0), కోహ్లీ (16), డివిల్లీర్స్‌ (1) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హెట్‌మయెర్‌ (47 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 75), గుర్‌కీరత్‌ సింగ్‌ (48 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 65)  నాలుగో వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా హిట్‌మెయిర్‌ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 15 బంతుల్లో 12 పరుగులే చేయాల్సి ఉండగా.. హెట్‌మయర్‌, గుర్‌కీరత్‌ స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో సన్‌రైజర్స్‌ శిబిరంలో ఆశలు చెలరేగాయి. కానీ.. చివరి ఓవర్లో ఉమేశ్‌ (9 నాటౌట్‌) 2 ఫోర్లు కొట్టి జట్టును గెలిపించాడు.