నగరంలో పలుచోట్ల ఐపీఎల్‌ టిక్కెట్లు

నగరంలో పలుచోట్ల ఐపీఎల్‌ టిక్కెట్లు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) సీజన్‌ -12 మార్చి 23న ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఇక ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈనెల 29న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అనంతరం 31న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు హైదరాబాద్ నగరంలోని 12 వేదికల్లో లభించనున్నాయి.

జింఖానా గౌండ్స్ (ప్యాట్నీ), ఎల్బీ స్టేడియం, సరూర్‌నగర్‌ స్టేడియం, బి–డబ్స్, అసెంబ్లీ మెట్రో స్టేషన్‌, సరూర్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ ఔట్‌లెట్‌లలో రిటైల్‌ టికెట్లతో పాటు టికెట్‌ రిడెమ్షన్‌ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఇక మియాపూర్‌ మెట్రో స్టేషన్‌, మూసాపేట్‌ మెట్రో స్టేషన్‌, హైదరాబాద్‌ నెక్ట్స్‌ గెలారియా మాల్‌ (పంజగుట్ట), హైదరాబాద్‌ నెక్ట్స్‌ గెలారియా మాల్‌ (హైటెక్‌ సిటీ), బేగంపేట్‌ మెట్రో స్టేషన్‌, నాగోల్‌ మెట్రో స్టేషన్‌ ఔట్‌లెట్‌లలో రిటైల్‌ టికెట్లు మాత్రమే లభిస్తాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య జరుగనున్న తొలి మ్యాచ్‌ కనీస టికెట్‌ ధర రూ. 500లుగా ఉంది. అయితే ఈ ధర కేవలం తొలి మ్యాచ్‌కు మాత్రమే. 31న జరిగే మ్యాచ్‌ కనీస టికెట్‌ ధర రూ. 781గా ఉంది. అభిమానులు టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా లేదా రిటైల్‌గానూ పొందవచ్చు. మరిన్ని వివరాలకు  www.sunrisershyderabad.in వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.