ఐపీఎల్ ఇండియాలోనే...

ఐపీఎల్ ఇండియాలోనే...

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ -12 వ సీజన్ టోర్నీని యూఏఈ లేదా దక్షిణాఫ్రికా తరలిస్తారని వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. ఇండియాలోనే టోర్నీ జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. మార్చి 23న టోర్నీ ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే టోర్నీ షెడ్యూల్‌ను మాత్రం ప్రకటించలేదు. చర్చల అనంతరం టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) వెల్లడించింది. 

ఐపీఎల్ షెడ్యూల్, వేదికలపై చర్చించడానికి వినోద్ రాయ్, డయానా ఎడుల్జీల నేతృత్వంలోని సీఓఏ మంగళవారం ఢిల్లీలో సమావేశమైంది. కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు, సంబంధిత అధికారులతో చర్చించిన అనంతరం ఐపీఎల్ 12వ సీజన్ ను ఇండియాలోనే నిర్వహిస్తున్నామని బీసీసీఐ తెలిపింది. మే 30 వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కనీసం 15 రోజుల గ్యాప్ ఉండేలా ఐపీఎల్ షెడ్యూల్ ఉండనుంది. ఈ ప్రకారం మార్చి 23న టోర్నీ ప్రారంభమై మే 15 లోపు ముగియనుంది.