ఐపీఎల్ 2020 షెడ్యూల్ రిలీజ్.. అదనంగా మరో 6 రోజులు పండగే..!

ఐపీఎల్ 2020 షెడ్యూల్ రిలీజ్.. అదనంగా మరో 6 రోజులు పండగే..!

క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే పండగ వచ్చేస్తోంది.. ఎంతో ఆదరణ పొందిన పొట్టి క్రికెట్ లీగ్ ఐపీఎల్.. ఈ ఏడాది సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెబుతూ ఐపీఎల్ 2020 షెడ్యూల్ ప్రకటించారు. ఈ సీజన్ మార్చి 29వ తేదీన ప్రారంభం కానుంది.. మే 24వ తేదీన ముగియనుంది. ఇక, గత సీజన్ల కంటే ఈ ఏడాది అదనంగా ఆరు రోజులు క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే.. మొదటి మ్యాచ్ మార్చి 29న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల  మధ్య వాంఖడే స్టేడియంలో జరుగనుండగా ఫైనల్ కూడా అక్కడే నిర్వహించనున్నారు.
 
గత సీజన్‌లో 44 రోజుల పాటు ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించగా.. ఈ సీజన్‌లో 50 రోజులు మ్యాచ్‌లు కనువిందు చేయనున్నాయి. ఆదివారాలు రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. అయితే మ్యాచ్ టైమింగ్స్ లో ఎలాంటి మార్పులు లేవు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే మొదటి మ్యాచ్ ను  ఏప్రిల్1న హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో ముంబై జట్టుతో తలపడనుంది. మే 17న ఆఖరి లీగ్ మ్యాచ్, మే 24న ఫైనల్ జరుగనున్నాయి. రాజస్థాన్ రాయల్స్ మినహా మిగతా ఫ్రాంచైజీలు తమ సొంత వేదికలను కొనసాగించాలనే నిర్ణయించుకోగా, రాజస్థాన్ మాత్రం గౌహతిలో రెండు మ్యాచ్ లను నిర్వహించాలని భావిస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక హైదరాబాద్ సన్ రైజర్స్ విషయానికి వస్తే, ఉప్పల్ లో తొలి మ్యాచ్ ని ఏప్రిల్ 1వ తేదీన ఆడనున్న జట్టు, ఆపై 12, 16, 26, 30, మే నెలలో 5, 12 తేదీల్లో మ్యాచ్ లను ఆడనుంది. ఇతర ఫ్రాంచైజీల సొంత వేదికలపై ఏప్రిల్ 4, 7, 19, 21, మే 3, 9, 15 తేదీల్లో సన్ రైజర్స్ మ్యాచ్ లు జరుగుతాయి. మొత్తానికి క్రికెట్ పండగకి ఫ్యాన్స్‌ రెడీ కావాల్సిందే ఇక...