ఐపీఎల్ వేలం: అదరగొట్టిన విదేశీ ఆటగాళ్లు... స్వదీశీ ప్లేయర్లు ఉసూరుమన్నారు..!

ఐపీఎల్ వేలం: అదరగొట్టిన విదేశీ ఆటగాళ్లు... స్వదీశీ ప్లేయర్లు ఉసూరుమన్నారు..!

ఐపీఎల్ 2020 కోసం ఆటగాళ్లను దక్కించుకునేందుకు జట్ల యాజమాన్యాలు పోటాపోటీగా వేలంలో పాల్గొన్నాయి. 332 మంది ఆటగాళ్లు కోసం 8 జట్ల ప్రాంచైజీలు ఈ పోటీలో పాల్గొన్నాయి. కోల్‌కతా వేదికగా సాగిన ఈ వేలం పాటలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ కోట్లు కొల్లగొట్టాడు. టెస్టుల్లో నెంబర్‌ వన్ బౌలర్‌గా కొనసాగుతున్న కమిన్స్‌ కోసం బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ  ఫ్రాంఛైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి రూ.15.50 కోట్లకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కమిన్స్‌ను దక్కించుకుంది. ఇక మరో ఆసీస్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ కూడా వేలంలో తన సత్తా చాటాడు. గ్లెన్ మాక్స్ వెల్ ను  రూ.10.75 కోట్లకు కింగ్స్ పంజాబ్ ఎలెవన్ దక్కించుకుంది.

ప్రతిసారి అంచనాలతో బరిలో దిగి నిరాశపరుస్తున్న ఆర్సీబీ ఈ సారి  సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌మోరిస్‌ కోసం ఏకంగా రూ.10 కోట్లు వెచ్చించింది. 1.5 కోట్ల కనీస ధర నుంచి 10 కోట్లు వరకు మోరిస్ పడగలెత్తాడు. మోరీస్‌ కోసం ముంబై ఇండియన్స్‌ కూడా తీవ్రంగా ప్రయత్నించింది.  ఇంగ్లాండ్‌ యువ ఆల్‌రౌండర్‌ శామ్‌ కరణ్‌ను రూ. 5.5 కోట్లకు చెన్నై దక్కించుకోగా.. ఇయాన్‌ మోర్గాన్‌ ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసింది. విండీస్ యువ సంచలనం హెట్‌మెయర్‌ని ఢిల్లీ రూ.7.75 కోట్లకు వేలంలో దక్కించుకుంది. ఇక ఆసీస్ హిట్టర్ ఆరోన్ ఫించ్‌ను ఆర్సీబీ రూ.4.40 కోట్లకు దక్కించుకుంది. మిచెల్ మార్ష్‌ని సన్‌రైజర్స్ రూ.2 కోట్లకు దక్కించుకుంది.  పేస్ బౌలర్‌ అండర్ 19 ఆటగాడు కార్తిక్ త్యాగిని రాజస్థాన్ రూ. 1.30 కోట్లకు దక్కించుకుంది. వరుణ్‌ చక్రవర్తి కోసం కేకేఆర్ ఏకంగా రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. లెగ్‌ స్పిన్నర్ పియూష్‌ చావ్లాను చెన్నై రూ. 6.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక వేలంలో అమ్ముడవని ఆటగాళ్ల కూడా ఉన్నారు. యూసఫ్‌ పఠాన్‌, పుజారా, స్టువర్ట్ బిన్నీలను ప్రాంచైజీలు అసలు పట్టించుకోలేదు. న్యూజిలాండ్ ఆల్ రౌండర్‌ గ్రాండ్ హోమ్‌కు కూడా చుక్కెదురైంది.